వ‌న్డే ప్ర‌పంచక‌ప్ ఫైన‌ల్ ఓట‌మి.. టి20 క‌ప్ ముందు హోట‌ల్ మార్పు

2023 వ‌న్డే ప్ర‌పంచక‌ప్... ఒక్క ఓటమి కూడా లేకుండా టీమ్ఇండియా ఫైన‌ల్ చేరింది. మొద‌టి మ్యాచ్ లో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా చేతిలో ఫైన‌ల్లో తేలిగ్గా ఓడిపోయింది.;

Update: 2026-03-07 12:30 GMT

2023 వ‌న్డే ప్ర‌పంచక‌ప్... ఒక్క ఓటమి కూడా లేకుండా టీమ్ఇండియా ఫైన‌ల్ చేరింది. మొద‌టి మ్యాచ్ లో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా చేతిలో ఫైన‌ల్లో తేలిగ్గా ఓడిపోయింది. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో నాడు చాలా బ‌లంగా క‌నిపించిన టీమ్ ఇండియా ఇలా ప‌రాజ‌యం పాల‌వుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అభిమానులకు అంత‌గా షాక్ ఇచ్చింది ఆ మ్యాచ్. ఈ నేప‌థ్యంలో నాటి మ్యాచ్ జ‌రిగింది ఎక్క‌డ? అని చూస్తే... ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌దైన అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో. ఇప్పుడు టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కూడా ఇదే స్టేడియంలో నిర్వ‌హిస్తున్నారు. పైగా, అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో టీమ్ఇండియాను దారుణంగా దెబ్బ‌కొట్టిన న్యూజిలాండ్ తో. అందుకే, ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికోసం ముందుగా ఆట‌గాళ్లు బ‌స చేయాల్సిన హోట‌ల్ ను మార్చేసిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఐటీసీ న‌ర్మ‌ద కాదు.. తాజ్ స్కై లైన్..

టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో అహ్మ‌దాబాద్ లోని ఐటీసీ న‌ర్మ‌ద‌లో బ‌స చేసింది. కానీ, నాడు మ్యాచ్ లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం మాత్రం తాజ్ స్కై లైన్ కు మారిన‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే రెండు జ‌ట్లూ హోట‌ల్ కు చేరుకున్నాయి. మ‌రోవైపు గురువారం భార‌త జ‌ట్టు సెమీస్ ఆడింది ముంబైలో అనే సంగ‌తి తెలిసిందే. అప్పుడు మ్యాచ్ కు ముందు చంద్ర‌గ్ర‌హణం వ‌చ్చింది. దీంతో ప్రాక్టీస్ ను జ‌ట్టు ఆల‌స్యంగా మొద‌లుపెట్టింది. అహ్మ‌దాబాద్ లో హోట‌ల్ మార్పును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వ‌ర్గాలు ధ్రువీక‌రించ‌లేదు.

పుణె నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

ర‌ద్దీ నేప‌థ్యంలో అహ్మ‌దాబాద్ లో జ‌ర‌గ‌నున్న టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కు ముంబై, పుణె నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నారు. విమాన టికెట్ల ధ‌ర‌లు పెరిగినందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, అటు విమాన‌యాన సంస్థ‌లు కూడా ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డుపుతున్నాయి. ఇందులో హైద‌రాబాద్ నుంచి కూడా అహ్మ‌దాబాద్ కు అద‌న‌పు స‌ర్వీసులు తిప్పుతున్నాయి.

Tags:    

Similar News