పారాహుషార్.. మరో ఘోర పరాజయం పొంచి ఉన్న టీమ్ఇండియా
చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీమ్ఇండియా టెస్టుల్లో స్వదేశంలో 0-3తో ఒకే ఒక్కసారి ఓడిపోయింది..! అదికూడా ఎన్నడూ భారత్ లో సిరీస్ గెలవని న్యూజిలాండ్ చేతిలో.;
చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీమ్ఇండియా టెస్టుల్లో స్వదేశంలో 0-3తో ఒకే ఒక్కసారి ఓడిపోయింది..! అదికూడా ఎన్నడూ భారత్ లో సిరీస్ గెలవని న్యూజిలాండ్ చేతిలో. ఆ దెబ్బతో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ల టెస్టు కెరీర్ ప్రమాదంలో పడింది. చివరకు ముగ్గురూ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే జట్టు.. కానీ, టెస్టులు పోయి వన్డే సిరీస్ వచ్చింది. ప్రస్తుతం వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఆదివారం ఇండోర్ లో జరగబోయే చివరి వన్డేలోనూ టీమ్ఇండియా ఓడిపోతే, స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ కు వన్డే సిరీస్ ను చేజార్చుకున్న చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. అయితే, మన జట్టు ఓటమి పాలుకాకూడదని మనందరికీ ఉంటుంది. కానీ, పరిస్థితులు అలా లేవు. గురువారం నాటి రెండో వన్డేనే తీసుకుంటే, రాజ్ కోట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు అతికష్టమ్మీద 284 పరుగులు చేసింది. అదేమంటే.. పిచ్ మందకొడిగా ఉందనే సమాధానం ఇచ్చారు. కానీ, ఇదే పిచ్ పై న్యూజిలాండ్ బాటర్లు అలవోకగా బ్యాటింగ్ చేశారు. 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు. టీమ్ఇండియా ఆటపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
బ్యాటర్లు సరే మరి మన బౌలర్లకు ఏమైంది..?
పిచ్ ఎలా ఉన్నా పరుగులు చేయాలి అనే పిడివాదనను పక్కనపెడితే.. బ్యాటర్లు మోస్తరు స్కోరు అందించారు. కానీ, దానిని కాపాడలేకపోయారు బౌలర్లు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు ఇద్దరూ నిశాశపరిచారు. మరీ ముఖ్యంగా హైదరాబాదీ సిరాజ్ సారథ్యంలోని పేస్ విభాగం పేలవంగా ఉంది. సిరాజ్ ఓకే.. కానీ, ప్రసిద్ధ్ క్రిష్ణ, హర్షిత్ రాణా బౌలింగ్ లో అంత పదును కనిపిచండం లేదు. వికెట్ కూడా సహకరిస్తున్నా.. మంచిగానే మొదలుపెట్టినా.. వీరు చివరకు వచ్చేసరికి చేతులెత్తేశారు. ఇక స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ తేలిపోయారు. కుల్దీప్ రెండో వన్డేలో 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు ఇచ్చాడు. మండకొడి పిచ్ పైనే అతడు ఇలాంటి ప్రదర్శన చేయడం గమనార్హం. ఇదే సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్లు, సీమర్లు పిచ్ లోని స్లోనెస్ ను అందిపుచ్చుకుని భారత బ్యాటర్లకు కళ్లెం వేశారు.
ఇలాంటి కూర్పుతో ఎలా?
వన్డే జట్టులో 50 ఓవర్ల పాటు ఆడగల బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు కావాలి. గాయం భయంతో పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమవడం, మేటి పేసర్ బుమ్రాను టి20లకు అట్టిపెట్టుకోవడంతో వన్డే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికి చాన్సులు అయిపోతున్నాయి. రెండో వన్డేలో 20 పరుగులు చేసినా అవి ఉపయోగపడలేదు. బౌలింగ్ లో అతడి ప్రభావం లేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సి ఉంది. రాజ్ కోట్ వన్డేలో అనూహ్యంగా కోహ్లి విఫలం కావడం, శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగా ఔట్ అవడంతో మధ్య ఓవర్లలో పరుగులు చేసేవారు లేకపోయారు. కోహ్లి-రోహిత్ లేకుంటే వన్డేల్లో మిడిల్ ఓవర్లలో టీమ్ఇండియా తడబడుతోంది. రెండో వన్డేలో ఇది స్పష్టం అయింది కూడా.
-మూడో వన్డే కాస్త మంచు ప్రభావం ఉండే ఇండోర్ లో జరగనుంది. ఆదివారం ఈ అవకాశాన్ని టీమ్ ఇండియా సద్వినియోగం చేసుకుని సిరీస్ ను పట్టేయాలి. లేదంటే, న్యూజిలాండ్ కు తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్ ను కోల్పోయిన చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వస్తుంది.