ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అసాధ్యమా? మరి గతంలో జరిగిందేమిటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరిగ్గా మరొక్క రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి 19వ సీజన్ కు తెరలేవనుంది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరిగ్గా మరొక్క రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి 19వ సీజన్ కు తెరలేవనుంది. ఇప్పటికే గత నెల 16న అబుదాబిలో లీగ్ మినీ వేలం పూర్తయింది. లీగ్ కు ముందే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి20 ప్రపంచ కప్ రూపంలో ప్రేక్షకులకు ధనాధన్ అనుభవం కలగనుంది. అంటే.. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి టి20 ప్రపంచ చాంపియన్ ఏ దేశమో తేలుతుంది..! డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంటుందా? మరొక దేశం విజేతగా ఆవిర్భవిస్తుందా? అనేది ఆసక్తికరంగా ఉండనుంది. అంతేకాదు.. టి20 ప్రపంచకప్ లో మెరుపులు మెరిపించే బ్యాట్స్ మన్, బౌలర్ ఎవరు? అనేది కూడా ఎంతో ఇష్టంగా గమనించే అంశం. మొత్తమ్మీద ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26 నుంచి అయితే భారత ప్రేక్షకులకు ఫిబ్రవరి 7 నుంచే కనులవిందు మొదలుకానుంది. లీగ్ కు సంబంధించి ఏ చిన్న విషయం అయినా తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. తాజాగా టీమ్ఇండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పార్థివ్ పటేల్ ఇలాంటి అంశమే వెల్లడించాడు.
ఆ రెండేళ్లు ఏం జరిగింది?
2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదేళ్లు చిన్నచిన్న సమస్యలున్నా సజావుగానే సాగింది. కానీ, 2013లో పెద్ద కుదుపు ఎదురైంది. ఆ ఏడాది మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో లీగ్ ప్రతిష్ఠపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతేకాదు.. మాజీ విజేతలైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్లు నిషేధం పడింది. లీగ్ లో కొన్ని మ్యాచ్ ల ఫలితాలు చూసి.. అప్పుడప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు వస్తుంటాయి. వీటిని పార్థివ్ పటేల్ ఖండించాడు. లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అసాధ్యం అని అన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదని కుండబద్దలు కొట్టాడు. ఫోన్ కాల్స్ ,ఈ మెయిల్స్.. హోటల్ రూమ్ లోకి ఎవరు వస్తున్నారు? అనేది రికార్డు అయి ఉంటుందని.. అంతేగాక చాలా గట్టి భద్రత ఉంటుందని తెలిపాడు.
కెప్టెన్ కూ అక్రిడేషన్..
ఐపీఎల్ లో అందరికీ అక్రిడేషన్ (గుర్తింపు) అవసరం అని.. కెప్టెన్ అయినా సరే అక్రిడేన్ లేకుంటే మైదానంలోకి, డ్రెస్సింగ్ రూంలోకి అనుమతించరని పార్థివ్ చెప్పాడు. ఐపీఎల్ లోనే కాదు.. అంతర్జాతీయ క్రికెట్ లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ నిందలను నిరూపించడం కష్టం అని స్పష్టం చేశాడు. కాగా, 2013లో లీగ్ స్పాట్ ఫిక్సింగ్ వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను ఈ ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నింగ్స్ లో నిర్ణీత ఓవర్లలో ఇన్ని పరుగులు ఇచ్చేలా వీరు ఫిక్సింగ్ చేసినట్లుగా తేలింది. సీఎస్కే యజమాని గుర్నాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ ఓనర్ రాజ్ కుంద్రాలు బెట్టింగ్ కు పాల్పడినట్లు తేలింది. ఫ్రాంచైజీల యజమానుల ప్రమేయం ఉందని తేలడంతో 2016, 2017 సీజన్లలో చెన్నై, రాజస్థాన్ లపై వేటు వేశారు. శ్రీశాంత్ సహా మిగతా ఇద్దరు ఆటగాళ్లపై జీవిత కాల నిషేధం విధించారు. తర్వాత దీనిని సుప్రీం కోర్టు ఏడేళ్లకు తగ్గించింది.
-2019, 2022లో పాక్ నుంచి వచ్చిన సమాచారం ఆధారం ఐపీఎల్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. నెట్ వర్క్ ను ఛేదించింది. అయితే, పార్థివ్ చెప్పినదాంట్లో వాస్తవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ దాదాపు అసాధ్యం అనేది మాత్రం పచ్చి నిజం.