మరో పరాభవం.. న్యూజిలాండ్ పై చరిత్రలో తొలిసారి వన్డే సిరీస్ లాస్
ఏడుసార్లు ద్వైపాక్షిక సిరీస్ లు.. కానీ, భారత్ పై భారత్ లో ఒక్కసారి కూడా గెలిచింది లేదు.;
ఏడుసార్లు ద్వైపాక్షిక సిరీస్ లు.. కానీ, భారత్ పై భారత్ లో ఒక్కసారి కూడా గెలిచింది లేదు. నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు సహా భారత్ కు 16 సార్లు రాక.. కానీ, ఒక్కసారి కూడా విజేతగా నిలిచింది లేదు.. అంతేకాదు.. కేవలం మూడుసార్లు మాత్రమే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్ లో తేలింది..! కానీ, ఈసారి మాత్రం న్యూజిలాండ్ పట్టు వదల్లేదు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకుని చరిత్ర నెలకొల్పింది. టీమ్ ఇండియాకు మరో పరాభవం మిగిల్చింది. ఏడు సిరీస్ ల తర్వాత సొంతగడ్డపై భారత్ కు వన్డేల్లో పరాజయం ఎదురైంది. ఆదివారం ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. దీనికిముందు 2024 చివర్లో జరిగిన టెస్టు సిరీస్ ను కివీస్ 3-0తో కైవసం చేసుకుంది. తద్వారా అప్పట్లోనే చరిత్రలో తొలిసారి భారత్ ను టెస్టుల్లో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసిన రికార్డును సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ జయకేతనం ఎగురవేసింది.
ఇదేం ఆట..?
కివీస్ పై ఇండోర్ వన్డేలో ఓడితే తీవ్ర పరాభవం తప్పదని తెలుసు. అయినా టీమ్ఇండియా నిరాశపరిచింది. వడోదరలో జరిగిన తొలి వన్డేలో గెలిచి మూడు మ్యాచ్ ల సిరీస్ ను శుభంగా ప్రారంభించిన శుబ్ మన్ గిల్ సేన.. ఆ తర్వాత రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయింది. ఇలాంటి సమయంలో మూడో వన్డేలో జాగ్రత్తగా ఆడాలి. ఇండోర్ మైదానం చిన్నది. బౌండరీలు సులువుగా కొట్టొచ్చు. అంతేగాక పిచ్ కూడా బ్యాటింగ్ కు పూర్తి అనుకూలం. కానీ, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీనికి న్యాయం చేసినట్లుగానే తొలుత కనిపించింది. ఐదు పరుగులకే 2 వికెట్లు తీసింది. 58 పరుగుల వద్ద మూడో వికెట్ నూ పడగొట్టింది. కానీ, చివరకు కివీస్ కు ఏకంగా 337 పరుగుల భారీ స్కోరు ఇచ్చింది. న్యూజిలాండ్ బ్యాటర్లు ముఖ్యంగా డారిల్ మిచెల్ 131 బంతుల్లో 137 (15 ఫోర్లు, 3 సిక్సులు), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 106, 9 ఫోర్లు, 3 సిక్సులు) ఏకంగా నాలుగో వికెట్ కు 291 పరుగుల పార్ట్ నర్ షిప్ అందించారు. కెప్టెన్ బ్రాస్ వెల్ 18 బంతుల్లో 28 నాటౌట్ (ఫోర్, 3 సిక్సులు) రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా 6 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. కుల్దీప్ యాదవ్ వికెట్ తీసినా 6 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లయిన వీరిద్దరే 12 ఓవర్లలో 89 పరుగులు ఇవ్వడం అంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో స్పష్టం అవుతోంది. పేసర్ హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసినా 10 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకున్నాడు. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 63 పరుగులు ఇచ్చాడు.
బ్యాటింగ్ తుస్..
అసలే భారీ లక్ష్యం.. కానీ, టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ 13 బంతుల్లో 11 పరుగులే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 18 బంతుల్లో 23 పరుగులే చేయగలిగాడు. శ్రేయస్ అయ్యర్ (3) అవనసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ (1) స్పిన్ బౌలర్ లెనాక్స్ బౌన్స్ ను అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా (12) బ్యాట్ తోనూ విఫలమయ్యాడు.
ఒకే ఒక్కడు కోహ్లి.. తోడుగా తెలుగోడు...
సహచరులు వెనుదిరుగుతున్నా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి 108 బంతుల్లో 124 (10 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుత సెంచరీతో అభిమానులను అలరించాడు. కోహ్లికి తోడుగా మరొక్క టాప్ ఆర్డర్ బ్యాటర్ నిలిచినా ఈ మ్యాచ్, సిరీస్ భారత్ వశం అయ్యేవి. కానీ, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 57 బంతుల్లో 53 (2 ఫోర్లు, 2 సిక్సులు), హర్షిత్ రాణా 43 బంతుల్లో 52 (4 ఫోర్లు, 4 సిక్సులు) మాత్రమే రాణించారు. ఇద్దరూ అర్థ సెంచరీలు చేశాక వెంటనే ఔట్ కావడం, హైదరాబాదీ సిరాజ్ (0) తొలి బంతికే డకౌట్ గా వెనుదిరగడంతో టీమ్ఇండియా ఓటమి ఖాయమైంది. ఒత్తిడి పెరిగిన కోహ్లి భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ ఇచ్చేశాడు. దీంతో భారత్ 46 ఓవర్లోల 296 పరుగులకు ఆలౌటైంది. చరిత్రలో తొలిసారి న్యూజిలాండ్ కు వన్డే సిరీస్ ను పువ్వుల్లో పెట్టి అందించింది. భారత్ లో 1988 నుంచి 8సార్లు వన్డే సిరీస్ ఆడిన న్యూజిలాండ్ చిట్టచివరగా సిరీస్ ను గెలిచింది.