టెస్టులో తుస్.. వ‌న్డేల్లో ప్చ్.. టి20 జ‌ట్టుపైనే ఆశ‌ల‌న్నీ!

సొంత‌గ‌డ్డ‌పై ఎన్న‌డూ లేనివిధంగా టెస్టుల్లో ఏడాదిలో రెండు క్లీన్ స్వీప్ లు.. బ‌ల‌హీన జ‌ట్టుపై సిరీస్ గెలుపు.;

Update: 2026-01-19 04:23 GMT

సొంత‌గ‌డ్డ‌పై ఎన్న‌డూ లేనివిధంగా టెస్టుల్లో ఏడాదిలో రెండు క్లీన్ స్వీప్ లు.. బ‌ల‌హీన జ‌ట్టుపై సిరీస్ గెలుపు. విదేశాల్లో ఒక సిరీస్ లాస్.. (దీంతోనే ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ చాన్స్ గ‌ల్లంతు)..! కంటితుడుపుగా విదేశంలో ఒక సిరీస్ డ్రా..!

12 ఏళ్ల త‌ర్వాత చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన‌ప్ప‌టికీ... వ‌న్డేల‌లో 27 ఏళ్ల త‌ర్వాత ఒక జ‌ట్టుకు సిరీస్ అప్ప‌గింత‌.. చ‌రిత్ర‌లో తొలిసారిగా మ‌రో జ‌ట్టు చేతిలో స్వ‌దేశంలో వ‌న్డే సిరీస్ ఓట‌మి..! విదేశంలో ఒక సిరీస్ ప‌రాజ‌యం.. స్వ‌దేశంలో మ‌రో సిరీస్ లో గెలుపు..!

ధ‌నాధ‌న్ గేమ్ టి20ల్లో మాత్రం ఆస్ట్రేలియాలో గెలుపు.. ఆసియా క‌ప్ లో విజ‌యం.. ఈ ఫార్మాట్ లో ఎదురులేదు అనే ధీమా. కానీ, కెప్టెన్ ఫామ్ మాత్రం పేలవం.

..ఇదీ టీమ్ ఇండియా ఏడాదిన్న‌ర ప్ర‌యాణం. తాజాగా న్యూజిలాండ్ చేతిలో వ‌న్డే సిరీస్ ను కోల్పోవ‌డంతో మ‌న జ‌ట్టు ఆట‌తీరును విశ్లేషిస్తున్నారు అభిమానులు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్ర‌భావంతో టి20ల్లో దుమ్మురేపుతున్న భార‌త జ‌ట్టు అదే స‌మ‌యంలో టెస్టులు, వ‌న్డేల్లో తేలిపోతోంది. న్యూజిలాండ్ తో ఈ నెలలోనే ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ ల‌ టి20 సిరీస్ లోనూ భార‌త్ దే పైచేయి అని పైకి కనిపిస్తోంది. కానీ, వ‌చ్చే నెల 7 నుంచి మ‌న దేశంలోనే జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఎలా ఆడుతుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

పొట్టి ఫార్మాట్ లో బ‌లంగా...

స్టార్ బ్యాట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, గొప్ప స్పిన్న‌ర్ అశ్విన్ టెస్టుల‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. రోహిత్, కోహ్లి వ‌న్డేల్లో కొన‌సాగుతున్నా మిగ‌తా జ‌ట్టు కూర్పు కుద‌ర‌డం లేదు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీమ్ఇండియా టి20 జ‌ట్టు మాత్ర‌మే బ‌లంగా, స్థిరంగా ఉంది అనేది అభిమానుల అంద‌రి అభిప్రాయంగా క‌నిపిస్తోంది. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కొన్నాళ్లుగా వ‌ర‌స‌గా విఫ‌లం అవుతున్నా.. యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌, హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌, స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, మిడిలార్డ‌ర్ లో హార్దిక్ పాండ్యా వంటి మేటి ఆల్ రౌండ‌ర్ ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. అర్ష‌దీప్ సింగ్ వంటి స్వింగ్ బౌల‌ర్ టి20ల‌కు అతికిన‌ట్లు స‌రిపోతూ జ‌ట్టుకు స‌మ‌తూకం తెస్తున్నాడు.

చ‌రిత్ర అనుకూలంగా లేదు

టి20 ప్ర‌పంచ‌క‌ప్ లో మ‌న‌ జ‌ట్టు గెలుస్తుందా? అంటే మాత్రం చెప్ప‌లేం. ఇప్ప‌టివ‌ర‌కు ఆతిథ్య దేశం ఏదీ ఈ ప్ర‌పంచ క‌ప్ గెలుచుకోలేదు. డిఫెండింగ్ చాంపియ‌న్ (2024లో భార‌త్ విజేత‌) కూడా క‌ప్ ను నిల‌బెట్టుకోలేదు. ఏ ఒక్క జ‌ట్టు కూడా రెండుసార్లు మించి క‌ప్ గెల‌వ‌లేదు. అందుక‌నే చ‌రిత్ర అనుకూలంగా లేద‌నే సెంటిమెంట్ వ్య‌క్తం అవుతోంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి జ‌రిగే ప్ర‌పంచ క‌ప్ న‌కు ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. న్యూజిలాండ్ తో జ‌రిగే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆడే జ‌ట్టే ప్ర‌పంచ క‌ప్ లోనూ దిగుతుంది. త‌ద్వారా టీమ్ ఇండియాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికిన‌ట్లు అవుతుంది.

కొస‌మెరుపుః టీమ్ ఇండియాకు ప్రియ‌మైన ప్ర‌త్య‌ర్థి ఎవ‌రంటే.. న్యూజిలాండ్ అనే చెప్పాలి. అనేక ఐసీసీ టోర్నీల్లో కివీస్ మ‌న‌ల్ని తీవ్రంగా దెబ్బ‌కొట్టింది. ఇప్పుడు టి20 ప్ర‌పంచ క‌ప్ న‌కు ముందు కూడా అదే ప‌నిచేస్తుందా?

Tags:    

Similar News