ఆపరేషన్ ఎమ్మెల్యే... జగన్ మార్క్ స్ట్రాటజీ..?

Update: 2022-03-21 02:30 GMT
ఏపీలో ఎన్నికల ఎత్తులకు అధికార పార్టీ రెడీ అయిపోయింది. విపక్షం ఎపుడైనా ఎన్నికలు పెట్టండి మేము సిద్ధమని చాలా కాలంగా చెబుతోంది. కానీ మూడేళ్ళకు చేరువ అవుతున్న వేళ వైసీపీలో కూడా ఒక్కసారిగా వేడి పుడుతోంది. గత కొన్ని రోజులుగా జగన్ పార్టీ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేసారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఇక తిరుగులేదు అన్నది ఆయన ఆలోచన.

దానికి ప్రాతిపదిక కూడా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓడితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇబ్బందుల్లో పడుతుంది. ఉనికి పోరాటం కూడా మొదలవుతుంది. ఇక జనసేన వంటి పార్టీలకు కూడా ఇది చాలా కీలకమైన సమయం. పవన్ ఇన్నాళ్ళూ పార్టీ బండిని ఏదో విధంగా  లాక్కొచ్చినా ఈసారి ఓడినా అధికారం దక్కకపోయినా ఆ పార్టీ చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 2029 మరోప్రస్థానం అంటే క్యాడరూ లీడరూ కూడా సహకరించకపోవచ్చు.

అందుకే ఈసారి ఎన్నికలు చాలా క్రూషియల్ అని వైసీపీ మాస్టర్ మైండ్స్ భావిస్తున్నాయి. ఏదో విధంగా రెండవసారి కూడా గెలిచేస్తే తాము కోరుకున్నట్లుగా విపక్షాలు చిత్తు అవుతాయి కాబట్టి  మరిన్ని టెర్ములు ఏపీని సోలోగా హ్యాపీగా  ఏలవచ్చునన్న‌ది ఫ్యాన్ పార్టీకి తడుతున్న భేషైన ఆలోచనట.

ఇక వైసీపీకి ఉన్న ఆశలూ, ధీమాలు ఏంటి అంటే జగన్ మీద జనాల్లో ఇంకా నమ్మకం సడలలేదు. అదే టైం లో ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అన్ని చోట్లా అని కాదు కానీ సగానికి సగం ఎమ్మెల్యేల మీద అయితే నెగిటివిటీ ఇప్పటికే  వచ్చేసింది. వారికి టికెట్లు ఇస్తే అధినాయకత్వం భారీ రిస్క్ ఫేస్ చేయల్సిందే.

దాంతో ఈసారి ఆ ఎమ్మెల్యేలను పూర్తిగా మార్చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందుకో తొంబై మంది దాకా ఫస్ట్ టైం గెలిచిన వారే ఉన్నారు. వీరంతా మూడేళ్ల కాలంలో తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించలేకపోయారు. మరో వైపు చూస్తే సొంత పనులలో చాలా మంది ఉంటే బిజినెస్ వ్యవహారాల్లో మరికొంత మంది ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల మీద కూడా కొందరి విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయట.

ఇవన్నీ ఎప్పటికపుడు పీకే టీం ద్వారా జగన్ కి నివేదికలు వస్తున్నాయి. దాంతో ఆ ఎమ్మెల్యేలను తప్పించేయాలని చూస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని వారిని, ప్రజలలో వ్యతిరేకత ఉన్న వారిని, అవినీతి ఆరోపణలు ఉన్న వారిని తప్పించి కొత్త వారికి టికెట్లు ఇస్తేనే మరోసారి వైసీపీ పవర్ లోకి వస్తుందన్నది పీకే విజయమంత్రంగా చెబుతున్నారు. దాన్ని తుచ తప్పకుండా వైసీపీ హై కమాండ్ పాటిస్తుంది అంటున్నారు.

దాంతో వైసీపీ నుంచి చూసుకుంటే డెబ్బై మంది దాకా ఎమ్మెల్యేలకు ఈ తడవ టికెట్లు దక్కవని అంటున్నారు. ఫ్రెష్ లుక్ కోసం కొత్తవారిని తెచ్చి పెడతారని, దాంతో జనాలు కూడా వారిని చూసి ఓటేసే అవకాశం ఉంటుందని హై కమాండ్ అంచనాలు ఉన్నాయట. మరి డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తప్పించడం ఏపీ రాజకీయాలో ఎపుడూ జరగలేదు. కొత్త ముఖాలను తెస్తే విజయావకాశాలు ఎంతమేరకు ఉంటాయో తెలియదు కానీ సిట్టింగులకు సీటు చిరిగిపోతే మాత్రం వారు అరచి గోల చేస్తారు.

ప్రత్యర్ధి పార్టీలలోకి దూకుతారు. తామున్న  చోటనే అసమ్మతిని రాజేసి అభ్యర్ధుల  విజయావకాశాలను దెబ్బతీస్తారు. మరి ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్న  తలనొప్పులే. ఆపరేషన్ ఎమ్మెల్యే అంటే అంత ఈజీ విషయం కాదు, కానీ వైసీపీ గెలవాలీ అంటే ఇంతకు మించిన మార్గం లేదని పీకే సార్ చెబుతున్న వేళ వైసీపీ హై కమాండ్ ఆపరేషన్ కి రెడీ అవుతోంది అంటున్నారు. అందుకే సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని జగన్  సూచనాప్రాయంగా ఇటీవల జరిగిన వైసీపీఎల్పీ మీటింగులో చెప్పారని అంటున్నారు. చూడాలి మరి ఏ ఆపరేషన్ ఎలా సాగుతుందో.
Tags:    

Similar News