ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా ?

Update: 2022-07-02 16:30 GMT
ఇవి తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినటమే ప్రజాస్వామ్యమా ? అని సిన్హా ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా, కేంద్రంలో ఒకపుడు మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హాయేనా ఇలాంటి ప్రశ్నలు వేసిందని అని ఆశ్చర్యమేసింది. ఒక వ్యక్తి చెప్పినపుడు 135 కోట్లమంది జనాలు వినకుండా ఏమిచేస్తారు ? ఏమి చేయాలని సిన్హా ఉద్దేశ్యం. 135 కోట్లమంది ప్రజలు ఒక వ్యక్తిమాట వినటమే ప్రజాస్వామ్యమా అని అడుగటమే విచిత్రంగా ఉంది.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చేస్తే అదే రైటవుతుంది కదా. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే ఆందోళన రూపంలో ఆ విషయాన్ని చెప్పే హక్కు ప్రజలకు ఎలాగూ ఉంది.

ఒకవేళ అప్పటికీ మాట వినకపోతే తర్వాత ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని దింపేసే హక్కు కూడా ప్రజలకు ఉందికదా. రెండు వరస ఎన్నికల్లో ప్రజల ఎన్డీయేని ఎన్నుకున్నారు. దానికి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏమి చెబితే అదే చట్టమవుతుంది. దాన్నే జనాలంతా ఫాలో అవ్వాలన్న చిన్న విషయం సిన్హాకు తెలీదా ?

ఒకపుడు ఆర్ధికశాఖ మంత్రిగా సిన్హా తీసుకున్న నిర్ణయాలను యావత్ దేశం ఫాలో అవలేదా ? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయి, అవే చట్టాల రూపంలో అమలవుతాయన్న విషయం సిన్హాకు ఎవరూ చెప్పాల్సిన అవసరంలేదు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరంలేదు. ఈమధ్యనే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.

దీనికి వ్యతిరేకంగా రైతుసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేవాయి. చివరకు ఈ విషయంలో సుప్రింకోర్టు కూడా జోక్యంచేసుకున్నది. అన్నీ వైపుల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా చివరకు మోడి ప్రభుత్వం ఆ చట్టాలను రద్దుచేసిన విషయం సిన్హాకు తెలీదా ?

హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేసీయార్, కేటీయార్ తదితరులను సిన్హా కలిశారు. తనకు మద్దతు ఇవ్వమని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా కేంద్రప్రభుత్వ విధానాలపై పోరాటం సాగుతుందని చెప్పారు. విద్వేష ప్రసంగాలు సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.
Tags:    

Similar News