ఒక పక్క వాదనలు..మరోపక్క ఉరికి ప్రిపరేషన్

Update: 2015-07-30 02:41 GMT
ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అచ్చు సినిమాల్లో మాదిరే పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో యాకూబ్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో.. ఉరిశిక్ష అమలు పక్కా అయిపోతుంది. అయితే.. మెమన్ లాయర్లు మాత్రం కొత్త పాయింట్ బయటకు తీశారు.

రాష్ట్రపతి క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించిన తర్వాత .. తగిన సమయం ఇవ్వకుండా వెంటనే ఎలా ఉరి తీస్తారంటూ సుప్రీంకోర్టులో యాకూబ్ తరఫు న్యాయవాదులు దరఖాస్తు చేశారు. ఈ పరిణామం బుధవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత చోటు చేసుకుంది. మరోవైపు.. బుధవారం అర్థరాత్రి అంటే గురువారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ప్రక్రియను మొదలు పెట్టారు. తెల్లవారు జామున ఒంటి గంటకు అతన్ని నిద్ర లేపిన అధికారులు ఉరిశిక్ష అమలుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అంటే..ఢిల్లీలోని సుప్రీంకోర్టు హాల్ నెంబరు 4లో తెల్లవారుజామున మూడు గంటలకు ఒకపక్క ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ వాదనలు జరుగుతున్న సమయంలో.. మరోవైపు నాగపూర్ జైల్లో ఉరిశిక్ష అమలుకు సంబంధించి పనులు మొదలయ్యాయి. యాకూబ్ తరఫు చివరి క్షణంలో పెట్టుకున్న దరఖాస్తును తెల్లవారు జాము 4.30 గంటలకు తిరస్కరిస్తూ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అదే సమయానికి మరోవైపు నాగపూర్ లో ఉరిశిక్షకు సంబంధించి చాలానే ప్రక్రియ పూర్తి అయ్యింది. అంటే ఓ పక్క యాకూబ్ ఉరిని నిలిపివేయటానికి జోరుగా ప్రయత్నాలు సాగితే.. మరోవైపు.. ఉరిశిక్ష అమలు చేయటానికి అదే స్థాయిలో ఏర్పాట్లు జరిగాయన్న మాట. మొత్తంగా ముందుగా ప్రకటించిన సమయం కంటే కాస్త ముందే.. యాకూబ్ ఉరిశిక్ష అమలై.. 257 మంది మరణానికి కారణమైన వ్యక్తి ఊపిరి ఆగిపోయింది.
Tags:    

Similar News