కలిసి పోరాడకుంటే కరోనాను జయించలేం:డబ్ల్యూహెచ్ వో

Update: 2020-09-26 17:30 GMT
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి అనేక ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచవ్యాప్తంగా 9,84,064 మందిని పొట్టనబెట్టుకుంది. దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. ఈ మాయదారి వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయి. దానికితోడు భారత్ వంటి కొన్ని దేశాల్లో కొందరు పౌరులు కోవిడ్-19 నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ను అదుపు చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. కరోనాపై సమిష్టిపోరాటం లేకుంటే 20 లక్షల కొవిడ్ మరణాలు సంభవించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10 లక్షల మార్క్ కు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచంలోని అన్ని దేశాలు, పౌరులు ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని, అలా రాకుంటే మరో 10 లక్షల మరణాలు సంభవించినా ఆశ్చర్యపోనవసరం లేదని డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించింది. 10 లక్షల మరణాలు అనేది ఆందోళన కలిగించే అంశమని, ఆ సంఖ్య 20 లక్షలకు చేరకుండా ఉండేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. దురదృష్టవశాత్తూ 20లక్షల మార్క్ ను చేరుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని, అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు, పౌరుల సమిష్టి కృషితో ఆ సంఖ్యను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్ మైకల్‌ ర్యాన్ వెల్లడించారు. మూడు కోట్ల మందికి పైగా దాని బారిన పడ్డారు.




Tags:    

Similar News