ఆంధ్రోళ్లు..మరో వారం కేర్ పుల్ గా ఉండండి

Update: 2020-05-24 07:26 GMT
ఒకటి తర్వాత ఒకటిగా విరుచుకుపడుతున్న సమస్యలు ఏపీ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే మాయదారి రోగం కారణంగా ఏపీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొదట్లో దీని తీవ్రత లేకున్నా.. ఇప్పుడు అంతకంతకూ పెరిగిపోవటం సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించలేని పరిస్థితి. ఇది సరిపోదన్నట్లు ఆంఫియన్ తుపాను కాస్తలో తప్పి.. ఒడిశా.. పశ్చిమబెంగాల్ కు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి కొత్త కష్టం వచ్చింది. గడిచిన రెండు.. మూడు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మంట పుట్టిస్తున్న సూరీడు తీవ్రతకు ఆంధ్రోళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం సంగతే తీసుకుంటే.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 48 వరకు నమోదైనట్లు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. దీంతో.. ఏపీ ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

మంట పుట్టిస్తున్న ఈ ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడు కావటంతో.. ప్రజలు ఆగమాగం అవుతున్నారు. ఓపక్క మహమ్మారి మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోవటం మినహా మరో మార్గం లేకుండాపోయింది. ఇదిలా ఉంటే.. రానున్న ఆరు రోజులు ఏపీలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

తాజాగా వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మే 28 వరకు ఏపీలో ఎండలు మండిపోవటం ఖాయమంటున్నారు. అదే సమయంలో మే 29 నుంచి పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా చెబుతున్నారు. పెరిగే ఎండతో పాటు.. వడగాల్పుల తీవ్రత ఎక్కువని.. ఆంధ్రోళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దీంతో ఏపీలోని తమ వారి పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో తెలంగాణలోని పలువురిలో వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే... ఏపీతో పోలిస్తే తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువే. కాకుంటే.. ఇప్పటివరకు కాచిన ఎండలతో పోలిస్తే మాత్రం.. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువేనని చెప్పక తప్పదు. గడిచిన మూడు.. నాలుగు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లోనూ ఎక్కువగా ఉంటుందంటున్నారు. కాకుంటే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఏమైనా.. మండే ఎండల వేళలో జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరం ఉంది. 
Tags:    

Similar News