టీ సెక్ర‌టేరియ‌ట్‌కు కొత్త స్థ‌లం దొరికింది

Update: 2015-07-15 12:07 GMT
తెలంగాణ స‌చివాల‌యం....ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుతో స‌మానంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న అంశం. వాస్తు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌స్తుత‌ సెక్ర‌టేరియ‌ట్‌కు దూరంగా ఉంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా కొత్త స‌చివాల‌యంపై కేసీఆర్‌కు ప్రత్యేక ఆస‌క్తి ఉన్న‌ట్లుగా కూడా విన‌వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎర్ర‌గ‌డ్డ స‌మీపంలోని చెస్ట్ ఆస్ప‌త్రి స్థ‌లాన్ని కొత్త స‌చివాల‌యం నిర్మాణం కోస‌మ‌ని మొద‌ట ఓకే చేశారు. దానిపై నిర‌స‌న‌లు వ‌చ్చిన క్ర‌మంలో సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌ను ప్ర‌తిపాదించారు. అయితే....కేంద్ర ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో దానిపైనా వెన‌క్కు త‌గ్గారు. త‌ర్వాత శిల్పారామం స‌మీపంలో స‌చివాల‌యం అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మాచారం మొద‌ట తెలంగాణ ర‌వాణ మంత్రి తుమ్మ‌ల వెంక‌టేశ్వ‌ర రావు ఇచ్చి ఆ త‌ర్వాత ఆయ‌నే కాద‌న్నారు. కానీ తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది.

బేగంపేట‌లోని ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని స‌చివాల‌యం కోసం తెలంగాణ స‌ర్కారు ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తం 700 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్టు స్థలాన్ని స‌చివాల‌యం కోసం తీసుకోవ‌చ్చా? ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే అవాంత‌రాలు, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది నివేదిక రూపంలో  ఇవ్వాలంటూ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌ను కోరిన‌ట్లు స‌మాచారం. అయితే ఎయిర్‌పోర్ట్ స్థ‌లం పూర్తి స్థాయిలో హైద‌రాబాద్ ప‌రిధిలోకి రాదు కాబ‌ట్టి రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌తో క‌లిసి స్థ‌లం గురించిన వివ‌రాలు ప్ర‌భుత్వానికి అందించిన‌ట్లు తెలుస్తోంది.

మొత్తంగా సెక్ర‌టేరియ‌ట్ మార్పు అంశం మ‌రోమారు విఫ‌లం అవుతుందా అనే అభిప్రాయాలు ఉన్నాయి. బేగంపేట ఎయిర్‌పోర్టును క‌మ‌ర్షియ‌ల్ ట్రాఫిక్ కోసం ఉప‌యోగించ‌న‌ప్ప‌టికీ...వీఐపీలు, ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం ఇప్ప‌టికీ ఉప‌యోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విమానాశ్ర‌య స్థ‌లం ఇవ్వాలంటే కేంద్ర పౌర‌విమానయాన శాఖ ఓకే చేయాల్సి ఉంటుంది. ఇది అంతా ఈజీగా పూర్త‌య్యే ప్ర‌క్రియ కాద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే...అంతే స్థాయిలో వేరే చోట స్థ‌లం ఇచ్చిన‌ప్ప‌టికీ అది పౌరవిమాన‌శాఖ‌కు అంత‌గా ఉప‌యుక్తం కాద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News