వర్ధంతి రోజునే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టిన టీడీపీ నేత తనయుడు

Update: 2019-12-15 07:13 GMT
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే విశాఖపట్నంలో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఓ రాజకీయ నేత కుమారుడు వాహనంతో ఢీకొట్టడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనయుడు.. ఎంపీ రామ్మోహన్‌ నాయుడి బావమరిది అయిన అప్పలనాయుడు కారుతో యాక్సిడెంట్ చేయడంతో పొట్టి శ్రీరాములు విగ్రహం స్వల్పంగా ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు ఒకరు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

విశాఖ బీచ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినప్పటికి అప్పలనాయుడు మద్యం తాగి ఉన్నాడని - స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడని చెబుతున్నారు. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని - అదుపు తప్పిన అప్పలనాయుడు కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా - దానిపై ప్రయాణిస్తున్న యువకుడికి గాయాలు అయ్యాయని - అతన్ని ఆసుపత్రికి తరలించామని స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు అప్పలనాయుడితో పాటు రిటైర్డ్ డీఐజీ కుమారుడు ఒకరు కూడా అందులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా పరారీలో ఉన్నారని సమాచారం.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును స్టేషన్ కు తరలించారు. కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి - దానిపై ఏర్పాటు చేసివున్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాకిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Tags:    

Similar News