సజ్జల రామకృష్ణా రెడ్డికి కీలక పదవి..

Update: 2019-06-15 13:09 GMT
వైఎస్ రాజశేఖర  రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు పాత్రను ఎవరూ మరవలేరు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అచ్చం అదే హోదాలో ఒక నియామకం చేపట్టారు. పబ్లిక్ ఎఫైర్స్ విషయంలో ప్రభుత్వ సలహాదారుగా అప్పుడు కేవీపీ  రామచంద్రరావు వ్యవహరించగా, ఇప్పుడు అచ్చం అదే హోదాతో సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ అవకాశం లభించింది.

మొదటి నుంచి జగన్ వెంట నిలిచినందుకు సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇలా తగిన హోదా లభించింది. గతంలో 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించారు సజ్జల. జర్నలిస్టిక్ నేపథ్యం ఉన్న ఆయన సాక్షి ఆవిర్భావం దగ్గర నుంచి ఆ సంస్థ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆ సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు. అటు  టెలివిజన్ కు , ఇటు పత్రికకు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈడీగా వ్యవహరించి.. ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మీడియా ద్వారా అసలు వాయిస్ వెళ్లడటంలో కీలక పాత్ర పోషించారు.

కొన్ని సంవత్సరాల పాటు 'సాక్షి'లో అదే హోదాలో కొనసాగారాయన. అలా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కొన్నాళ్లకు పార్టీ పదవిలోకి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు వహిస్తూ వచ్చారు. వేర్వేరు జిల్లాలకు ఇన్ చార్జిగా కూడా వ్యవహరించిన నేపథ్యం ఉంది సజ్జలకు.
కొన్ని జిల్లాల ఇన్ చార్జిగా పార్టీ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా పార్టీ విజయంలో తనవంతు పాత్రను పోషించారు  సజ్జల రామకృష్ణా రెడ్డి.

కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో ఆయన పడిన కష్టానికి తగిన పదవిని కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి. కేబినెట్ ర్యాంకుతో కూడిన సలహాదారు పదవిని, పబ్లిక్ ఎఫైర్స్ వ్యవహారాల సలహాదారు హోదాను కల్పించారు జగన్ మోహన్ రెడ్డి. మొదటి నుంచి తన వెంట ఉన్న వారికి ఇలా జగన్ మోహన్ రెడ్డి తగిన అవకాశాలను ఇస్తూ ఉన్నారు. కీలకమైన బాధ్యతలను  వారికి అప్పగిస్తున్నారు.
Tags:    

Similar News