ఇకపై తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు

Update: 2020-09-24 05:15 GMT
తెలంగాణలో అసలు భూపంచాయితీలే లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. అవినీతికి తావు లేని వ్యవస్థను ఏర్పాటుకు వడివడిగా నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇప్పటికే వీఆర్వో వ్యవస్థలను రద్దు చేసి వారిని వేరే శాఖల్లో కలిపేసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో అవినీతితో మకిలిపెట్టిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారదర్శకంగా.. ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ప్రజల కోసం ఆన్ లైన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.

తాజాగా తెలంగాణలో ఇకపై ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పేదలు ఏళ్లుగా ఉంటున్న ఇళ్ల స్థలాలను పూర్తిగా క్రమబద్ధీకరిస్తామని.. దీని ద్వారా ఆస్తుల మీద రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

భూవివాదాలు, ఘర్షణల నుంచి శాశ్వత రక్షణ కోసమే వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేదల ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. దీంతో వారు భవిష్యత్ లో బ్యాంకు రుణాలు పొందగలరని పేర్కొన్నారు.

ఇలా తెలంగాణలో ఇక భూ, వ్యవసాయ, ప్లాట్లు, స్థలాలకు సంబంధించి ఎలాంటి గొడవలు లేకుండా పారదర్శకంగా ‘ధరణి పోర్టల్’ను అందుబాటులోకి తెస్తున్నారు.  
Tags:    

Similar News