పాక్ పెట్టిన కొత్త చిచ్చు.. షాక్స్ గామ్ లోయ గురించి తెలుసా..!
అవును... కశ్మీర్ లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం షాక్స్ గామ్ లోయ.;
పాకిస్థాన్ తాను ప్రశాంతంగా ఉండదు.. భారత్ ను ప్రశాంతంగా ఉంచదని.. అందుకు తనకు అనుగుణంగా చైనాను ఉసిగొల్పుతూ వాడుకుంటుందని అంటుంటారు! ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారింది షాక్స్ గామ్ లోయ. కశ్మీర్ లో అత్యున్నత పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు భారత్ - చైనా నడుమ ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. ప్రస్తుతానికి ఈ విషయం మాటల తూటాల మధ్య ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ వివాదం అనేది ఇప్పుడు చూద్దామ్...!
అవును... కశ్మీర్ లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం షాక్స్ గామ్ లోయ. ఇటు కారకోరం పర్వత శ్రేణులను, అటు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ ను ఆనుకునే ఉండే ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ కారకోరం శ్రేణిగా పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనా, దక్షిణాన, పశ్చిమాన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం ఉన్నాయి. అలా ఈ లోయ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండటంతో దీనిపై ఆధిపత్యం చాలా ప్రధానంగా మారింది.
అసలు ఏమిటీ వివాదం..?:
స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో నాటి అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం షాక్స్ గామ్ లోయను ఆక్రమించేసింది. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపినా.. పాక్ అక్కడ నుంచి వైదొలగలేదు. అనంతరం ఎన్నో అవకాశాలు వచ్చినా.. ఈ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ భారత్ కూడా చేయలేదని అంటారు. ఈ పరిణామాల నేపథ్యలో.. 1950ల్లో చైనా ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం మొదలు పెట్టింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే చైనాతో భారత్ సంబంధాలు క్రమంగా దిగజారడం మొదలైంది. ఈ సమయంలోనే పాకిస్థాన్ ఓ కుటిల ఆలోచన చేసింది. ఇందులో భాగంగా... 1963లో నాటి పాక్ పాలకుడు అయూబ్ ఖాన్.. యార్కండ్ నదితో పాటుగా షాక్స్ గామ్ లోయ మొత్తాన్నీ చైనాకు ధారాదత్తం చేసేశారు. ఇదే అదనుగా... చైనా – పాక్ ఎకనామిక్ కారిడార్ పేరు చెప్పి కొన్నేళ్లుగా అక్కడ చైనా దూకుడుగా పలు నిర్మాణాలు చేపట్టింది.
ఈ పరిణామల నేపథ్యంలో భారత్ తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య చట్ట విరుద్ధమని ఢిల్లీ వ్యాఖ్యానిస్తూ, ఈ భూభాగంపై భారత్ హక్కును నొక్కి చెప్పింది. అయితే తాజాగా భారత్ ఖండనపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్తినిధి మావో నింగ్.. ఆ భూభాగం చైనా భూభాగంలో భాగమని.. చైనా తన సొంత భూభాగంలో చేస్తున్న మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ప్రశంసనీయమని అన్నారు.
భారత్ స్టాండ్ ఇది!:
ఈ సందర్భంగా ఈ షాక్స్ గామ్ లోయలో చైనా చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను భారత్ తిరస్కరించింది. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్... షాక్స్ గామ్ లోయ భారత్ భూభాగమని.. 1963లో సంతకం చేయబడిన చైనా – పాక్ సరిహద్దు ఒప్పందం అని పిలవబడే దానిని తాము ఎప్పుడూ గుర్తించలేదని. ఆ ఒప్పందం చట్టవిరుద్ధమని, అది చెల్లనిదని తాము నిత్యం చెబుతూనే ఉన్నామని అన్నారు.