తమిళనాడులో ఎన్డీయే గెలుస్తుందా ?

ఎన్డీయేని తమిళ జనాలు ఆదరిస్తారు అని ప్రధాని నరేంద్ర మోడీ దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా తమిళనాడులో పర్యటిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-03-12 07:30 GMT

ఎన్డీయేని తమిళ జనాలు ఆదరిస్తారు అని ప్రధాని నరేంద్ర మోడీ దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా తమిళనాడులో పర్యటిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని బుధవారం వరుసగా కేరళం తమిళనాడులలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక విధంగా ఆయన ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లే అని అంటున్నారు ఎందుకంటే మరి కొద్ది రోజులలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ఇక్కడ అలా శ్రీకారం చుట్టింది అన్న మాట.

ద్రవిడ సీమలో కమలం :

దేశంలో ఎక్కువగా ప్రాంతీయ అభిమానం కలిగిన రాష్ట్రాలలో తమిళనాడుని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అక్కడ మొదటి నుంచి ద్రవిడ వాదానికి పెద్ద పీట వేస్తారు. అందుకే అక్కడ ఏర్పాటు అయ్యే ప్రతీ ప్రాంతీయ పార్టీ ద్రవిడ వాదాన్ని ఎత్తుకుంటుంది. తాము దానిని కాపాడుతామని గట్టిగా చెబుతుంది. కొత్తగా ఏర్పాటు అయిన సినీ నటుడు విజయ్ పార్టీ కూడా ద్రవిడ వాదంతోనే రంగంలోకి దిగుతోంది. ఇక డీఎంకే అన్నా డీఎంకేల గురించి వేరేగా చెప్పాల్సింది లేదు. ఈ రెండు పార్టీలు ద్రవిడ వాదాన్ని శ్వాసగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. అలాంటి తమిళనాడులో జాతీయ పార్టీలకు కాలం చెల్లి ఆరు దశాబ్దాలు అవుతోంది. మరి కమలం పార్టీ తాము తమిళ సీమలో జెండా పాతుతామని ధీమాగా ఎలా చెబుతోంది అన్నదే ప్రశ్న.

వ్యతిరేకత మీదనే ఆశలు :

అధికార డీఎంకే వ్యతిరేకత మీదనే ఎన్డీయే కోటి ఆశలు పెట్టుకుంది పైగా తమిళనాడులో ఒక పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. ఒక పార్టీకి అయిదేళ్ల పాటు అధికారం అందించిన తరువాత మరో పార్టీని గద్దెనెక్కించడం జనాలకు అలవాటు. అఫ్ కోర్స్ అది 2016లో కొనసాగించలేదు, వరసగా రెండోసారి జయలలిత అధికారంలోకి వచ్చింది. అది తప్ప అంతకు ముందు పరిస్థితి మాత్రం ఇదే. దాంతోనే అన్నా డీఎంకేని ముందు పెట్టుకుని బీజేపీ తన గెలుపు ఆశలను పెంచుకోవాలని అనుకుంటోంది. అయితే గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ చూస్తే డీఎంకే మీద వ్యతిరేకత ఉండడం వాస్తవమే అయినా దానిని పూర్తిగా అంది పుచ్చుకునే స్థితిలో అన్నా డీఎంకే కానీ మిత్రపక్షం బీజేపీ కానీ ఉన్నాయా అన్నదే పెద్ద చర్చగా ఉంది.

అదే పెద్ద లోటుగా :

డీఎంకేకి స్టాలిన్ రూపంలో ఒక ఇమేజ్ కలిగిన నాయకుడు కనిపిస్తున్నాడు. అదే అన్నా డీఎంకే బీజేపీ కలసిన ఎన్డీయే కూటమికి ప్రజాకర్షణ కలిగిన లీడర్ లోటు ఉంది అని అంటున్నారు. స్టాలిన్ ది అయిదు దశాబ్దాల విశేష రాజకీయ అనుభవం. కరుణా నిధి వారసుడిగా వ్యూహాలను రచించడమో నేర్పు సాధించారు. అలాగే తన వారసుడిగా ఉదయ నిధిని తీర్చి దిద్దుతున్నారు. ఆ ఎత్తుగడలతోనే మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు, దివంగత నటుడు నాయకుడు విజయ్ కాంత్ పార్టీని డీఎంకేలో కలిపేసుకున్నారు. కమల్ హాసన్ పార్టీతో పొత్తు ఉండనే ఉంది. ఇలా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు స్టాలిన్ వేస్తున్న ఎత్తులు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.

విజయ్ పార్టీతోనే అంతా :

ఇక గతానికి భిన్నంగా విజయ్ పార్టీ టీవీకే ఇపుడు రంగంలో ఉంది. విజయ్ పార్టీ రాకతో త్రిముఖ పోటీ ఏర్పడింది. దాంతో సహజంగానే అధికార డీఎంకే వ్యతిరేక ఓట్లే చీలిపోతాయి. అది ఎన్డీయే కూటమికే పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఇక జయలలిత స్నేహితురాలుగా ఉన్న శశికళ పార్టీ పెడుతున్నారు. ఆమె రంగంలోకి దిగితే అన్నా డీఎంకే ఓట్లకే ఎసరు వస్తుంది అని విశ్లేషణలు ఉన్నాయి. పైగా బీజేపీతో పొత్తు వల్ల అన్న డీఎంకేని ఇష్టపడే వారు ద్రవిడ వాదాన్ని నమ్మిన వారు వేరు అవుతారు అని కూడా అంటున్నారు. ఇలాంటి పరిణామాల నేపధ్యంలో ఎన్ డీయే తమిళనాడులో గెలుస్తుంది అని మోడీ ధీమా వ్యక్తం చేయడం వెనక వ్యూహం ఏమై ఉంటుంది అని చర్చ సాగుతోంది. అయితే డీఎంకేకి ఈసారి విజయం నల్లేరు మీద నడక అయితే కాదు, గట్టి పోటీ ఉంది. టీవీకే రాకతో హంగ్ వచ్చినా రావచ్చు అని అంటున్నారు. మరి ఈ ఆశలు అంచనాలే బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News