లోకేశ్ కు ట్విస్ట్.. ప్రధాని నుంచి ఊహించని రియాక్షన్..

ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.

Update: 2026-08-01 14:13 GMT

ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ వేడుకలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆప్యాయంగా భుజం తట్టి అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా లోకేష్ పనితీరును అభినందిస్తూ ప్రధాని మోదీ "బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్‌.. లోకేష్‌" అంటూ భుజం తట్టి అభినందించారు. ఇదే వేగంతో, మరింత స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన సూచించారు.




గతంలోనూ ఏపీలో ప్రధాని మోదీ పర్యటనలను విజయవంతం చేయడంలోనూ, యోగాంధ్ర రికార్డు సాధనలోనూ నారా లోకేష్ కీలక పాత్ర పోషించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. యువ నాయకుడిగా లోకేష్ చూపుతున్న చొరవను జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా కొనియాడడం గమనార్హం. రాష్ట్రంలో ప్రధాని పర్యటించిన ప్రతి సమయంలో మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా లోకేశ్ పనితీరును మెచ్చుకోవడంతోపాటు సమర్థ నాయకుడిగా ఎదుగుతున్న తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతోపాటు పెట్టుబడుల ఆకర్షణకు లోకేశ్ కష్టపడుతున్నారని గతంలోనూ ప్రధాని అభినందించారు.

అద్భుతమైన థింసా నృత్య ప్రదర్శన

కాగా, ప్రధాని సభలో గిరిజన విద్యార్థినులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భోగాపురం వేదికపై సుమారు 13,500 మందికి పైగా విద్యార్థులు, మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యం 'నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్' అన్నట్లుగా సాగిందని మంత్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని దేశం మొత్తం గర్వపడేలా చాటిచెప్పిన ఈ ప్రదర్శన ప్రధాని మోదీ మనసును పూర్తిగా గెలుచుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కిందని ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని బహిరంగ సభా వేదికకు వెళుతుండగా, ఆయన వాహనానికి ఇరువైపులా వేలాది మంది ఆదివాసీ బిడ్డలు సంప్రదాయ నృత్యంతో స్వాగతించారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రధాని కూడా పరవసించిపోయారు. ఓపెన్ టాప్ జీపుపై ప్రయాణిస్తున్న రెండు వైపులా మహిళలు ఏకరీతిలో నృత్యం చేయడం చూసిన ప్రధాని ఆనందంతో చప్పట్లు కొడుతూ వారిలో ఉత్సాహం నింపారు.

పొందూరు ఖద్దరు, బొబ్బిలి వీణతో అపూర్వ సత్కారం

సభా వేదికపైకి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు వస్త్రాన్ని ప్రధానికి బహూకరించడంతో పాటు, ఏపీ సంగీత వారసత్వానికి ప్రతీక అయిన అపురూప కళాఖండం 'బొబ్బిలి వీణ'ను కానుకగా అందించారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీణ విశేషాలను ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 17వ శతాబ్దంలో బొబ్బిలి సంస్థాన పాలకుల కాలంలో పురుడు పోసుకున్న ఈ వీణ ప్రయాణానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రత్యేకంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన నిపుణులైన కళాకారులు వేర్వేరు భాగాలుగా అతికించకుండా, కేవలం ఒకే ఒక పనస చెట్టు మొద్దుతో ఎంతో ఓపికగా ఈ 'ఏకాండ వీణ'ను తయారు చేస్తారు. దీని అసాధారణ హస్తకళా నైపుణ్యానికి 2011లో GI ట్యాగ్ లభించడమే కాకుండా, 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ODOP) కింద జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది.

తెలుగు వారసత్వానికి ప్రతీకలు

భోగాపురం విమానాశ్రయం రూపంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు నూతన ద్వారాలు తెరుచుకుంటున్న తరుణంలో... మన ప్రాచీన సంస్కృతికి ప్రతీకలైన బొబ్బిలి వీణ, పొందూరు ఖాదీలను ప్రధానికి అందించడం ద్వారా తెలుగు జాతి గొప్పతనం మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిధ్వనించిందని వ్యాఖ్యానిస్తున్నారు. సంగీతం, వారసత్వాల కలయికగా నిలిచిన ఈ వేడుక ఇద్దరు గొప్ప నాయకుల అనుబంధానికి, రాష్ట్ర పురోగతికి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిందని అధికార పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News