ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం భోగాపురం : సీఎం చంద్రబాబు

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర వాసుల శక్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Update: 2026-08-01 08:18 GMT

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర వాసుల శక్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు 2014లో ప్రతిపాదించామని, 2019లో శంకుస్థాపన చేశామని, ఇప్పుడు ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘నాడు కొబ్బరికాయ కొట్టింది మేమే.. ఇప్పుడు గుమ్మడికాయ కట్టింది మేమే’’ అంటూ చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి అనుమతులు తీసుకువచ్చింది అశోక్ గజపతిరాజు, శరవేగంగా నిర్మించేలా కృషిచేసింది రామ్మోహన్ నాయుడు, నిర్మించింది జీఎంఆర్. వీరంతా ఉత్తరాంధ్ర ప్రాంతీయులు కావడమే గర్వకారణమని చంద్రబాబు కొనియాడారు.

భోగాపురంలో 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలోనే విమానాశ్రయాన్ని పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది విమానాశ్రయాన్ని ప్రారంభించుకోగా, 2027లో పోలవరం ప్రాజెక్టును, 2028లో రాజధాని అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నింటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వ కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము, పవన్ కళ్యాణ్ కలిసి పునర్నిర్మించాలన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. 'ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది' అంటూ గతంలో అభివృద్ధిని అవహేళన చేసి, అడ్డుకున్న వారు నేడు అడ్రస్ లేకుండా పోయారంటూ విమర్శించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర శక్తిని చాటామని, స్థానిక వాసి అయిన జీఎమ్మార్ దీనిని నిర్మించగా, అశోక్ గడపతి రాజు తొలి అడుగులు వేయించారని, ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.

ప్రధాని మోదీ సహకారంతో దూసుకెళ్తున్న ఏపీ

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను ప్రధాని మోదీ నిలబెట్టారని, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 5.57 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ-దిశ మారినట్లే, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్‌ను నిర్మిస్తున్నామని, సముద్రం, కొండల మధ్య సాగే విమాన ప్రయాణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో రూ.2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 65 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకువస్తామని, భవిష్యత్తులో వంశధార-గోదావరి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న ఉత్తరాంధ్రకు త్వరలోనే ప్రజలు వలస వచ్చే రోజులు వస్తాయని, ఐటీ నుంచి ఏఐ (AI) వైపు వెళ్తున్న ప్రపంచానికి తగిన నాయకత్వ పటిమ ఏపీ అందిస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ 'నేషన్ ఫస్ట్' అనే సింగిల్ అజెండాతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. డిజిటల్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను 4వ స్థానానికి తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ప్రపంచ యుద్ధాల ప్రభావం దేశంపై పడకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ ఉత్తరాంధ్రలో ఇకపై పేదరికపు అరుపులు వినిపించకుండా, ఈ ప్రాంతాన్ని 'ఉత్తమ ఆంధ్ర'గా మారుస్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సభలో థింసా నృత్యంతో అద్భుత రికార్డులు సాధించిన కళాకారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News