వేల టన్నుల CO2ను తగ్గించే గ్రీన్ విప్లవం.. ప్రపంచాన్ని విస్మయపరుస్తున్న విద్యార్థిని ప్రయోగం
గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇలాంటి సమయంలో ఒక స్కూల్ విద్యార్థిని ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇలాంటి సమయంలో ఒక స్కూల్ విద్యార్థిని ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూల వాతావరణం కలిగిన అంటార్కిటికా ఖండంలో పరిశోధనా కేంద్రాల విద్యుత్ అవసరాలను తీర్చడానికి 17 ఏళ్ల చిలీ హైస్కూల్ విద్యార్థిని మరియా జావియరా వాలెంజులా ఒక అద్భుతమైన నూతన ఇంధన నమూనాను ప్రతిపాదించింది. అంటార్కిటికాలో డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కర్బన ఉద్గారాలను అరికట్టేందుకు ఈ బాలిక రూపొందించిన `న్యూక్లియర్-హైబ్రిడ్` మైక్రోగ్రిడ్ కాన్సెప్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
అంటార్కిటికాలోని తీవ్రమైన చలి, శీతాకాలంలో నెలల తరబడి ఉండే చీకటి వల్ల అక్కడ పవన, సౌర శక్తి ఆధారిత పునరుత్పాదన ఇంధన వనరులు మాత్రమే నిరంతర విద్యుత్‌ను అందించలేవు. దీంతో రీసెర్చ్ స్టేషన్లు నిరంతరం నడిచే డీజిల్ జనరేటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే అక్కడికి డీజిల్‌ను రవాణా చేయడం అత్యంత ఖరీదైనదే కాకుండా... దానివల్ల వెలువడే కార్బన్, బ్లాక్ కార్బన్ ఉద్గారాలు మంచు కరగడాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ తీవ్రమైన పర్యావరణ సమస్యకు పరిష్కారంగానే మరియా ఈ ఆలోచనను తెరపైకి తెచ్చింది.
మరియా ప్రతిపాదించిన ఈ వినూత్న ప్లాన్ ప్రకారం.. విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్లతో పాటు TRISO ఫ్యూయల్‌తో పనిచేసే నెక్స్ట్-జనరేషన్ `న్యూక్లియర్ మైక్రోరియాక్టర్`ను ఒకే మైక్రోగ్రిడ్‌లో అనుసంధానిస్తారు. అనుకూల వాతావరణం ఉన్నప్పుడు సోలార్, విండ్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. గాలి, సూర్యరశ్మి లేని సమయాల్లో ఈ చిన్న సైజు అణు రియాక్టర్ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందిస్తుంది. ఈ హైబ్రిడ్ విధానం వల్ల ఒకే ఒక పెద్ద అంటార్కిటిక్ స్టేషన్‌లో ఏడాదికి దాదాపు 3254 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ విద్యార్థిని లెక్కగట్టింది.
చిలీ నిర్వహించిన `2026 అంటార్కిటిక్ స్కూల్ ఫెయిర్` కోసం మరియా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పాఠశాల స్థాయిలో చేసిన ప్రాజెక్ట్ అయినా అంటార్కిటిక్ ఒడంబడిక నిబంధనలకు లోబడి, భద్రత- రేడియోయాక్టివ్ వ్యర్థాల నిర్వహణ సవాళ్లను అధిగమిస్తే ఇది భవిష్యత్తులో గొప్ప మార్పునకు శ్రీకారం చుడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మూస ధోరణికి భిన్నంగా స్టెమ్ (STEM) విద్యార్థిని చూపిన నూతన ఆలోచనా విధానం యువతలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంచేలా ఉంది.
ప్రస్తుతానికి ఇది కేవలం విద్యార్థి ప్రతిపాదించిన ఒక సైద్ధాంతిక భావన మాత్రమే అయినా అంటార్కిటికా వంటి సుదూర ధ్రువ ప్రాంతాలలో ఉద్గారాలను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సాగిస్తున్న పరిశోధనలకు ఇది ఒక కొత్త దిశను చూపింది. భవిష్యత్తులో అంటార్కిటికాను స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ ఖండంగా మార్చే దిశగా మరియా వేసిన ఈ అడుగు భవిష్యత్ తరం శాస్త్రీయ ఆవిష్కరణలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.