శ్రీనగర్‌లో కలకలం.. ఫరూక్ అబ్దుల్లా గురితప్పిన తూటా..

జమ్మూ-కశ్మీర్ రాజకీయ యవనికపై అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలు అనూహ్య రీతిలో అపాయంలో పడ్డాయి.;

Update: 2026-03-12 07:48 GMT

జమ్మూ-కశ్మీర్ రాజకీయ యవనికపై అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలు అనూహ్య రీతిలో అపాయంలో పడ్డాయి. బుధవారం (మార్చి 11) జమ్మూ శివార్లలోని ఒక లగ్జరీ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేలాది మంది అతిథులు, భారీ భద్రత ఉన్నప్పటికీ ఒక వ్యక్తి ఫరూక్ అబ్దుల్లాను అత్యంత సమీపం నుంచి కాల్చి చంపడానికి ప్రయత్నించడం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది.

పెళ్లి వేడుకలో

వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ శివార్లలోని ఒక హోటల్‌లో జరుగుతున్న వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరీ ఉన్నారు. వేడుకలో అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా ఒక వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా వెనుక వైపు నుంచి అత్యంత సమీపానికి చేరుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీని తీసి కాల్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆయన వెంటే ఉన్న గన్ మెన్లు, భద్రతా సిబ్బంది ఆ వ్యక్తి కదలికలను ముందే పసిగట్టి అప్రమత్తమయ్యారు. నిందితుడు ట్రిగ్గర్ నొక్కే లోపే అతడిని అడ్డుకోవడంతో ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు.

సినిమా స్టైల్‌లో సీసీటీవీ దృశ్యాలు!

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిందితుడు తుపాకీ తీయడం, అక్కడే ఉన్న జనం అతడిని పట్టుకొని చితకబాదడం వంటి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వివాహ వేడుక ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

20 ఏళ్ల పగ వెనుక రహస్యమేంటి?

నిందితుడిని జమ్మూకు చెందిన 63 ఏళ్ల కమల్‌సింగ్ జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూలో చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే కమల్‌సింగ్, విచారణ సమయంలో పోలీసులకు చెప్పిన విషయాలు విని అధికారులు అవాక్కయ్యారు. గత 20 ఏళ్లుగా తాను ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ప్లాన్ చేస్తున్నానని, ఇది తన వ్యక్తిగత అజెండా అని కమల్ వెల్లడించాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరపాలన్నది తన చిరకాల వాంఛ అని, అందుకే పెళ్లి వేడుకను అదనుగా ఎంచుకున్నట్లు తెలిపాడు. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే, అతను వాడిన తుపాకీకి లైసెన్స్ కూడా ఉంది.

మద్యం మత్తు.. భద్రతా వైఫల్యం?

ఘటన సమయంలో నిందితుడు తీవ్రంగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఒక జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి సమీపానికి తుపాకీతో ఒక వ్యక్తి ఎలా చేరుకోగలిగాడు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. హోటల్ వద్ద తనిఖీలు సక్రమంగా జరగలేదా? లేక పెళ్లి వేడుక కావడంతో పోలీసులు కాస్త ఉదాసీనంగా వ్యవహరించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నాయకుడిపై ఇలాంటి దాడులు జరగడం అంటే అది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్ లోని శాంతి భద్రతలపై జరిగిన దాడిగానే భావించాలి.

రాజకీయాల్లో విభేదాలు సహజం, కానీ హింసకు తావు లేదు. వ్యక్తిగత కక్షలతో లేదా పాత పగలతో దశాబ్దాల కాలం వేచి చూసి ఇలాంటి దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. ఫరూక్ అబ్దుల్లా క్షేమంగా బయటపడడం ఆ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పెద్ద ఊరట. అయితే, ఈ ఘటన కశ్మీర్ లోని వీఐపీల భద్రతను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. లైసెన్స్ ఉన్న తుపాకీలను కూడా బహిరంగ వేడుకల్లోకి ఎలా అనుమతించారనే దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడిన భద్రతా సిబ్బందిని మాత్రం అభినందించాల్సిందే!

Tags:    

Similar News