సొంత ఇంట్లోనే ఆళ్ల నాని అంత్య‌క్రియ‌లు.. లోకేష్ ఏమ‌న్నారంటే!

టీడీపీ నాయ‌కుడు, వైసీపీ మాజీ నేత ఏలూరుకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ఆళ్ల‌ నాని అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

Update: 2026-09-17 17:21 GMT

టీడీపీ నాయ‌కుడు, వైసీపీ మాజీ నేత ఏలూరుకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ఆళ్ల‌ నాని అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఏలూరులోని కాళీకృష్ణ గార్డెన్‌(ఆయ‌న నివాసం)లోని వెనుక‌వైపు ఉన్న స్థ‌లంలోనే ఆయ‌న కుమారులు ఈ అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. అంతిమ ఘ‌ట్టానికి మంత్రి, టీడీపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు నారా లోకేష్ హాజ‌ర‌య్యారు. తుది వీడ్కోలు ప‌లికారు. ఆళ్ల అభిమానులు.. వైసీపీ, టీడీపీ కి చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ఆళ్ల పార్థివ దేహానికి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆళ్ల నాని వివాద ర‌హిత నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. త‌న‌కు ఎప్ప‌టి నుంచో ఆళ్ల నానితో ప‌రిచ‌యం ఉంద‌ని.. త‌న‌కు కొన్ని మంచి విష‌యాలు చెప్పేవార‌ని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మె ల్సీగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున ఉప ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశార‌ని తెలిపారు. శాస‌న మండ‌లిలో ప‌లు మార్లు ఇరువురు ఎదురై మాట్లాడుకున్న‌ట్టు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు క‌నిపించినా.. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న ప‌ల‌క‌రించే వారని తెలిపారు.

వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని ఆళ్ల నాని చెప్పేవార‌ని.. ముఖ్యంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని చెప్పేవార‌ని.. దానిని తాను ఆచ‌రించాన‌ని తెలిపారు. ఎవ‌రిని క‌లిసినా.. చిరున‌వ్వుతో స్పందించేవార‌ని గుర్తు చేసుకున్నారు. ఆళ్ల నాని లేర‌న్న విష‌యం తెలిసి తాను దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌న్నారు. కుటుంబానికి అన్ని విష‌యాల్లోనూ అండ‌గా ఉంటాన‌ని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తొలుత ఆళ్ల నాని పార్థి వ దేహానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. ఆయ‌న కుమారులు, స‌తీమ‌ణిని ప‌రామ‌ర్శించి ఓదార్చారు. అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News