వైసీపీ కొత్త పోరాటం...జిల్లాల టూర్లకు జగన్ రెడీ !

ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Update: 2026-09-17 19:30 GMT

వైసీపీ సరి కొత్త పోరాటానికి సిద్ధం అవుతోంది. మెగా డీఎస్సీ అంటూ ఇప్పటిదాకా సింగిల్ అజెండాగా ముందుకు సాగిన వైసీపీ ఇపుడు కొత్త ఇష్యూని గుర్తించింది. సమాజంలో అతి పెద్ద సెక్షన్ గా ఉన్న రైతుల సమస్యల మీద ఉద్యమించాలని వైసీపీ నిర్ణయించింది. ఏపీ మొత్తం కరువు రక్కసి కబంధ హస్తాలలో ఉంది. దాంతో రైతాంగానికి అండగా ఉండాలని జగన్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో తాజాగావీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో కనీ వినీ ఎరగని విధంగా ఉన్న కరవు మీద పోరాటం చేయాలని కోరారు.

ఎల్లో నినో అంటూ :

ఏపీలో కరువు ఎల్ నినో వచ్చినది కాదు ఎల్లో నినో వల్ల వచ్చింది అని జగన్ సెటైర్లు పేల్చారు. ఎల్లో అంటే పసుపు పార్టీ అని అర్థం గా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎల్ నినో విధయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూటమి ప్రభుత్వం పట్టిచుకోలేదు అన్నది జగన్ ప్రధాన ఆరోపణగా ఉంది. అందుకే ఏపీ రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి అని జగన్ అంటున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సెప్టెంబర్‌ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు నమోదు అయిందని ఆయన ఆరోపించారు.

ఏపీలో మొత్తం అన్ని జిల్లాలూ వర్షపాతం లోటుతోనే ఉంది అని జగన్ విమర్శించారు.

మొత్తానికి మొత్తంగానే :

అంతే కాదు ఏపీలో 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని జగన్ అంటున్నారు. అదే విధంగా దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ నాయకుల మీట్ లో చెప్పారు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే 75 శాతం వర్షపాతం లోటు ఉంటే సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు ఉందని లెక్కలు కూడా ఆయన చెప్పారు. అలాగే చిత్తూరులో 58.5 శాతం, వైఎస్సార్‌ కడపలో 57 శాతం వర్షపాతం లోటు, తూర్పు గోదావరిలో 57 శాతం, మార్కాపురం–నంద్యాలలో 56 శాతం చొప్పున వర్షపాతం లోటు నమోదైందని గణాంకాలు ముందు పెట్టారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదని జగన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు ఏకంగా 15 వేల నుంచి 20 వేలకు పైగా నష్టపోయారని జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

విత్తనం కూడా పడలేదని :

ఇక ఏపీలో చూస్తే ఖరీఫ్ లో సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని జగన్ చెప్పారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదని అన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు నష్టపోయారని జగన్ పార్టీ నాయకులకు వివరించారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో రైతులకు రావాల్సిన మూడు వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఇదే సందర్భంగా జగన్ డిమాండ్ చేయడం విశేషం.

మండలాల నుంచి :

ఏపీలో తీవ్రమైన కరవు పరిస్థితుల నేపధ్యంలో రైతులతో కలసి వైసీపీ నాయకులు క్యాడర్ అంతా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని జగన్ కోరారు. అది మండలాల నుంచి నియోజకవర్గాలు ఆ మీదట జిల్లా స్థాయిల దాకా విస్తరించాలని ఆయన సూచించారు. అయితే తాము ఎన్ని ఆందోళనలు చేసినా జగన్ వస్తే ఆ లెక్క వేరు అని పార్టీ నేతలు వివరించారు. జగన్ తీవ్రమైన కరవు ఉన్న జిల్లాలకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని నేతలు కోరారు. దానికి జగన్ అంగీకరించడంతో రైతు ఆందోళన ఇపుడు వైసీపీకి హైలెట్ అయ్యేలా ఉంది. జగన్ జిల్లాల పర్యటనకు ఏ టాపిక్ ఉంటుంది అన్నది కూడా ఇపుడు స్పష్టత వచ్చింది. ఎక్కువ మంది జనాలకు కనెక్ట్ అయ్యే కరవు సమస్యతోనే జగన్ జిల్లాల పర్యటనకు రాబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ ఉద్యమాన్ని ఎప్పటి నుంచి చేపడతారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News