సంక్రాంతి స్పెషల్.. 29 ఏళ్ల అల్లుడి కోసం 290 వంటకాలతో విందు!

సంక్రాంతిలో పిండి వంటలు, కోడి పందాలు, ఆటల పోటీలు, ప్రభలు, రథాలు ఇవన్నీ ఒకెత్తు అయితే.. కొత్త అల్లుళ్ల సందడి మరొకెత్తు అనే చెప్పాలి.;

Update: 2026-01-16 13:23 GMT

సంక్రాంతిలో పిండి వంటలు, కోడి పందాలు, ఆటల పోటీలు, ప్రభలు, రథాలు ఇవన్నీ ఒకెత్తు అయితే.. కొత్త అల్లుళ్ల సందడి మరొకెత్తు అనే చెప్పాలి. సంక్రాతికి అత్తారింటికి వచ్చే కొత్త అల్లుడిని.. తన అత్తింటి వారు ఎలా చూసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి ఉన్నంతలో వారు అత్యంత ఘనంగా అల్లుడికి స్వాగతం పలికి, కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇక అతడికి పెట్టే ప్రత్యేక విందు మరీ ప్రత్యేకం. ఈ క్రమంలో 290 వంటకాలతో విందు ఆసక్తిగా మారింది.

అవును... సంక్రాంతి కొత్త అల్లుడు అనే పదం ఆంధ్రప్రదేశ్‌ లో బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ పండుగను కొత్త అల్లుళ్ల పండగ అని కూడా అంటారు. ఈ పండుగ వేళ కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు అత్తమామల ఇళ్ళు సంబరాలతో నిండిపోతాయి. ఈ సమయంలో ఎవరి తాహత మేరకు వాళ్లు అల్లుడికి బహుమతులు ప్రధానం చేస్తారు. ఇందులో బట్టలు, బంగారం, బైకు, కారు మొదలైనవి ఉంటాయి.

ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా నారాయపట్నంలోని తన అత్తగారి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిని వారు ట్రీట్ చేసిన విధానం ఆసక్తిగా మారింది. వివాహం అయిన తర్వాత తమ కుమార్తె మొదటి సంక్రాంతిని జరుపుకుంటన్న వేళ.. నాలెం రమేష్ కుమార్, అతని భార్య కళావతి.. తమ అల్లుడు శ్రీహర్ష కోసం అద్భుతమైన గోదావరి శైలి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. 29 ఏళ్ల శ్రీహర్ష గౌరవార్థం 290 విభిన్న సాంప్రదాయ వంటకాలను తయారు చేశారు.

ఈ భారీ విందులో సాంప్రదాయ స్వీట్లు, ప్రామాణికమైన ఏపీ స్పెషల్ రుచికరమైన వంటకాలు ఉన్నాయి. గురువారం శాంతి నగర్ నివాసంలో భోజనానికి వచ్చిన వరుడు ఈ గొప్ప వేడుకను చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో.. ఈ అల్లుడు గారెల బుట్టలో పడ్డాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు! గోదారి జిల్లాల్లో కొత్త అల్లుల్లకు ఆ రేంజ్ లో సాగుతుంది మరి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు!

Tags:    

Similar News