కారుమూరి క‌ష్టాలు... రాజీకి తిప్ప‌లు.. ?

వైసిపి మాజీమంత్రి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోక‌చెక్క‌లా మారిందన్న వాదన వినిపిస్తోంది.;

Update: 2026-03-09 16:30 GMT

వైసిపి మాజీమంత్రి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోక‌చెక్క‌లా మారిందన్న వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మద్యం కుంభకోణం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం. దీనికి తోడు ఈ కేసును విచారించే అధికారులకు ఆయన లంచం ఆఫర్ చేశారన్న మరోకేసు కూడా నమోదు కావడం. దీనిలో మరీ ముఖ్యంగా ఆయన కుమారుడి పేరు కూడా తెరమీద‌కు రావడంతో కారుమూరి నాగేశ్వరరావు అంతర్మ‌థ‌నంలో పడ్డారు.

గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కూడా సొంతం చేసుకున్నారు. కానీ చిత్రంగా అక్రమ మద్యం కేసులో నేరుగా ఆయన పాత్ర లేకపోయినప్పటికీ అప్పట్లో మద్యం కేసులను రవాణా చేశారని, దీనిలో కొంత కమిషన్ కూడా సొంతం చేసుకున్నారన్న వాదన ప్రత్యేక బృందం అధికారుల నుంచి వినిపిస్తోంది. దీని పైనే వారు కేసు నమోదు చేశారు. అయితే విచారణ సమయంలో తమ మీద ఆరోపణలు తగ్గించేలాగా.. ఒకరకంగా కేసును నిర్వీర్యం చేసేలాగా విచారణ అధికారులకు లంచం ఇవ్వ చూపారని అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే ఈ కేసుల నుంచి బయటపడేందుకు కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసిపి తరఫున ఆయనకు పెద్దగా ఎటువంటి అండ లభించలేదని, తన తరఫున గళం వినిపించేందుకు కూడా పార్టీ ముందుకు రాలేదని ఆవేదన‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే అంతర్గతంగా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తుంది. దీనిపై ఇటీవ‌ల‌ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసుల్లో ఇరుక్కున్న కొంతమంది తమకు టచ్ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. అయితే నేరుగా వారెవరు కారుమూరి నాగేశ్వరరావు పేరుగాని మరొకరి పేరుగాని చెప్పలేదు. అయినప్పటికీ కేసుల్లో ఇరుక్కున్న వారు నేరుగా ఆయా కేసులను ఎదుర్కొనే పరిస్థితి లేని వాతావరణం అయితే వైసీపీలో కనిపిస్తోంది. పార్టీ పరంగా ఎటువంటి రక్షణ, ఎటువంటి మద్దతు వారికి లభించకపోవడంతోనే ఇప్పుడు ఆవేదంలో ఉన్నారన్నది వాస్తవం.

కొంతమంది నాయకులు మాత్రమే పార్టీ పరంగా సపోర్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స‌హా ఒకరిద్దరు ఇలాంటి నాయకులకు మాత్రమే పార్టీ తరఫున న్యాయ సేవలు అందాయి. మరి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు విషయంలో పార్టీ ఏదైనా స్పందిస్తుందా లేకపోతే ఆయనను ఆయన సొంతానికే వదిలేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే నాగేశ్వరరావు రాజీమార్గాల్లో ఉన్నారని కూటమిలోని ఒక కీలక మంత్రి ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం స్పష్టంగా వినిపిస్తున్న వాదన.

మరి ఇది ఏ మేరకు ఆచరణలోకి వస్తుంది.. ఏ మేరకు నాగేశ్వరరావుకు మేలు చేస్తుంది అనేది చూడాలి. మరి వైసిపి ఆయన వదులుకుంటుందా లేదా రక్షణ కల్పిస్తుందా అనేది కూడా ఆసక్తికర అంశం.

Tags:    

Similar News