మిమ్మల్ని అరెస్టు చేస్తే.. తప్పేంటి?: సీఎంకు సుప్రీం నోటీసులు
ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బెంగాల్ డీజీపీ, కోల్ కతా పోలీసు కమిషనర్ల పేర్లు ఉన్నాయి.;
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ సలహాదారు, ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న.. ఐ-ప్యాక్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడులను అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వివాదం ముదిరి.. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కూడా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున కోలకతా వీధుల్లో ఈడీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఈడీ అధికారులు.. తమను కొట్టారంటూ ఇటు టీఎంసీ నేతలపైనా.. తమను అడ్డుకున్నారని.. దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని రోపిస్తూ.. బెంగాల్ డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌పైనా కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు. అయితే.. అటు ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న నేపథ్యం.. ఇటు పోలీసు అధికారులు కూడా ఉన్నతాధికారులు కావడంతో ఈడీ అధికారులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్తారు.
ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బెంగాల్ డీజీపీ, కోల్ కతా పోలీసు కమిషనర్ల పేర్లు ఉన్నాయి. వీరిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడంతో పాటు కేసులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. ``మిమ్మల్ని అరెస్టు చేయాలని ఈడీ అధికారులు కోరుతున్నారు. మీ రెస్పాన్స్ ఏంటో చెప్పాలి. అరెస్టు చేస్తే తప్పేంటి?`` అని ప్రశ్నించారు.
ఇక, డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్లకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం.. ఎన్నికలకు ముందు.. మరింత రచ్చకు దారితీసేలా చేసింది. గతంలో ఢిల్లీ ఎన్నికలకుముందు కూడా సీఎం కేజ్రీవాల్‌కు మద్యం కేసు చుట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి బలమైన కేసు లేకపోయినా.. ఐ-ప్యాక్ మనీలాండరింగ్‌కు పాల్పడిందన్న కేసును ఈడీ విచారిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రానికి-మమతాబెనర్జీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ వేడి రాజుకుంది. చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.