ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్..? 30 వేల మందిపై వేటు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది.;

Update: 2026-03-07 07:40 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. ఒకవైపు ఈ సాంకేతికత అద్భుతమైన ఆవిష్కరణలకు బాటలు పరుస్తుంటే... మరోవైపు ఉద్యోగ భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం 'ఒరాకిల్' సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీ తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుత టెక్ ప్రపంచంలో జరుగుతున్న అంతర్గత మార్పులకు అద్దం పడుతోంది.

పెట్టుబడుల భారం.. ఆపై ఆర్థిక సర్దుబాటు

ఒరాకిల్ ఇటీవల క్లౌడ్ మౌలిక సదుపాయాలు.. ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసింగ్‌కు అవసరమైన అత్యాధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి కంపెనీ భారీగా అప్పులు తీసుకున్నట్లు సమాచారం. ఈ విస్తరణ వ్యూహం దీర్ఘకాలంలో లాభదాయకం కావచ్చు.. కానీ స్వల్పకాలంలో కంపెనీపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. ఈ వ్యయాన్ని సమతుల్యం చేయడానికి వాటాదారుల అంచనాలను అందుకోవడానికి ఉద్యోగుల తగ్గింపే ఏకైక మార్గమని యాజమాన్యం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆటోమేషన్.. మానవ శ్రమకు ప్రత్యామ్నాయమా?

ఈ లేఆఫ్స్‌ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో 'ఆటోమేషన్' ఒకటి. డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్, రూటీన్ అడ్మినిస్ట్రేటివ్ పనులను ఏఐ ఆధారిత సిస్టమ్స్ మరింత వేగంగా తక్కువ ఖర్చుతో చేయగలవు. దీనివల్ల మానవ వనరుల అవసరం తగ్గుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా గత రెండేళ్లుగా ఇదే బాటలో పయనిస్తూ వేలాది మందిని ఇంటికి పంపాయి. 2026 నాటికి ఇప్పటికే టెక్ రంగంలో 35,000 మందికి పైగా ఉపాధి కోల్పోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

మారుతున్న నైపుణ్యాల అవసరం

టెక్ రంగంలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆందోళన కలిగించేవే కావు.. కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నాయి. సంప్రదాయ ఐటీ పాత్రలు కనుమరుగవుతున్న తరుణంలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ మోడల్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. అంటే ఉద్యోగాలు తగ్గడం లేదు, కేవలం 'నైపుణ్యాల అవసరం' మారుతోంది. పాత పద్ధతుల్లో పనిచేసే వారికంటే, ఏఐతో కలిసి పనిచేయగలిగే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి.

పరివర్తన తప్పదా?

ఒరాకిల్ వంటి సంస్థ తీసుకునే ఈ నిర్ణయాలు టెక్ రంగంలో ఒక కొత్త 'నార్మల్'ను సృష్టిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ, వేగవంతమైన ఆటోమేషన్, ఏఐపై ఆధారపడటం అనేవి భవిష్యత్తులో టెక్ కంపెనీల మనుగడకు ప్రధాన సూత్రాలుగా మారనున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను అందించడం..సామాజిక భద్రత కల్పించడం వంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంది. మొత్తం మీద టెక్నాలజీ ప్రపంచం ఒక కీలక మలుపులో ఉంది. ఇక్కడ నిరంతర అభ్యాసం మాత్రమే ఉద్యోగులకు శ్రీరామరక్ష.

Tags:    

Similar News