తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు అల్టిమేటం

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.;

Update: 2026-01-16 13:31 GMT

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జిల ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చామని, ఇక ఎంతమాత్రం జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది.

న్యాయస్థానం ఆగ్రహానికి కారణాలివే..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ వైఖరిపై కోర్టు కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తింది. గత ఏడాది నవంబర్‌లోనే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి కాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందగా, అందులో ఏడుగురికి స్పీకర్ ఇప్పటికే క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.శీతాకాల సెలవుల అనంతరం కోర్టు విధుల్లోకి వచ్చిన మొదటి రోజే ఈ కేసును విచారించిన ధర్మాసనం, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

ఏడుగురికి లైన్ క్లియర్.. ఆ ముగ్గురిపైనే ఉత్కంఠ!

గత పరిణామాలను పరిశీలిస్తే జనవరి 15న స్పీకర్ కార్యాలయం కీలక నిర్ణయం వెలువరించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య సహా ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని ప్రకటించారు. అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి ప్రకటన రాకపోవడమే ఇప్పుడు న్యాయపరమైన పేచీకి దారితీసింది. న్యాయప్రక్రియను గౌరవించాలి. ఈసారి కూడా తుది నిర్ణయం తీసుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనుంది.

Tags:    

Similar News