పెళ్ళిళ్ళ మీద పడ్డ గ్యాస్ బండ

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ఏకంగా మూడు నెలలకు పైగా శుక్ర మూఢం సాగి మంచి ముహూర్తాలు లేక నానా అవస్థలు పడిన మీదట ఫిబ్రవరి 17 నుంచి మళ్ళీ పెళ్ళిళ్ళకు శుభ ముహూర్తాలు వెల్లువలా వచ్చాయి.;

Update: 2026-03-10 23:30 GMT

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ఏకంగా మూడు నెలలకు పైగా శుక్ర మూఢం సాగి మంచి ముహూర్తాలు లేక నానా అవస్థలు పడిన మీదట ఫిబ్రవరి 17 నుంచి మళ్ళీ పెళ్ళిళ్ళకు శుభ ముహూర్తాలు వెల్లువలా వచ్చాయి. ఈ మంచి రోజులు అన్నీ మే నెల మధ్య వరకూ కొనసాగనున్నాయి. దాంతో అంతా కలసి ఈ రెండున్నర నెలల కీలక సమయంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలని చూస్తున్నారు. ముహూర్తాలు కూడా చాలా కాలం ముందే పెట్టుకున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ఇలా మొదలైందో లేదో అలా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వచ్చిపడింది. మొదట్లోనే ఈ యుద్ధం ముగుస్తుంది అని అంతా భావించారు. కానీ చూడబోతే ఇది దీర్ఘకాలిక యుద్ధం గా మారుతోంది.

భారీ షాక్ తగిలింది :

ఇరాన్ తో యుద్ధం అంటే చమురు ఆగిపోతోంది. ఇంధనం కొరత పట్టి పీడిస్తోంది. దాంతో ఇంధనంతో పాటుగా సహజ వాయువు అయిన గ్యాస్ సైతం కొరతతో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఈ మొత్తం పరిణామంతో పెళ్ళిళ్లకు పెద్ద దెబ్బ పడుతోంది. పెళ్ళి అంటే కచ్చితంగా వందలాది మందికి విందు ఉంటుంది. ఇపుడు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హొటళ్ళు మూత పడుతున్నాయి. అనేక హొటళ్ళు తాము ముందే కుదుర్చుకున్న పెళ్ళిళ్ళ కాంట్రాక్టులు చేయలేమని రద్దు చేసుకుంటున్నాయి. ఇంతమంది వండి వార్చడం తమ వల్ల కాదని హొటళ్ళు చేతులెత్తేయడంతో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వారి పాట్లు అన్నీ ఇన్నీ కావు.

సొంతంగా చేసుకుందామనుకున్నా :

హొటళ్లలో పెద్ద రెస్టారెంట్లలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేసి సొంతంగా కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేసుకుందామని అనుకున్నా క్యాటరింగ్ చేసే వారు కూడా తమ వల్ల కాదని అంటున్నారు. అంతా గ్యాస్ వల్లనే అవస్థలు అని తేల్చి చెబుతున్నారు. ఎవరు వంట వండాలన్నా గ్యాస్ ఉండాలి కదా అని చెబుతున్నారు. దాంతో పెళ్ళిళ్ళు ఎట్లా అన్న చింతలో ఉన్నత వర్గాల నుంచి మధ్య తరగతి వర్గాల దాకా అంతా పడిపోతున్నారు.

పార్టీలు బంద్ :

విందూ వినోదాలు పార్టీలు అన్నీ బంద్ చేసుకుని కూర్చోవ్బాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే ఏమి చేసుకోవాలన్నా గ్యాస్ సమస్య పట్టి పీడిస్తోంది. దాంతో వాటికి చెక్ పెట్టాల్సిందే అంటున్నారు. అంతే కాదు పెళ్ళి అంటే ఆ సందడి బంధువులు స్నేహితుల కోలాహలం అంతా మరచిపోవాల్సిందే అని అంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వధూ వరులు వారి దగ్గర బంధువులు కలసి ఏ చిన్న ఫంక్షన్ హాలులోనో లేదా ఏ గుడిలోనో వివాహం చేసుకోవడమే శరణ్యంగా అనిపిస్తోంది అంటున్నారు.

లాక్ డౌన్ నాటి పరిస్థితులు :

ఇవన్నీ చూసిన వారు లాక్ డౌన్ పరిస్థితులు మళ్ళీ తలెత్తాయని అంటున్నారు నలుగురు కలిస్తే అపుడు కరోనా వ్యాపిస్తుంది అని కంగారు పడేవారు, ఇపుడు నలుగురు కూడితే భోజనం ఎక్కడ నుంచి తేవాలన్న కలవరం పట్టుకుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోవాలా లేదా ముందు అనుకున్నట్లుగానే చిన్నగానే కానిచ్చేసుకోవాలా అన్నది ఎవరికి వారుగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే పెళ్ళిళ్ళు ఏ స్థాయిలోనూ చేసుకునే వాతావరణం ఉండదని ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద పిల్లి లేచే పరిస్థితి అయినా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి బంగారం లాంటి పెళ్ళిళ్ళ సీజన్ ని యుద్ధం భారీ దెబ్బ కొడుతోంది అని అంటున్నారు. ఈ సీజన్ లోనే కాటరింగ్ కి హొటళ్ళకు ఇతరమైన వ్యాపారాలకు మంచి అవకాశం అని అంటున్నారు. కానీ యుద్ధానికి అంతా కుదేల్ అయినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News