కాక్రోచ్ లొల్లి ఆగేలా లేదు.. ఢిల్లీలో మరో పోరాటానికి సిద్ధం?

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నెక్ట్స్ ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది.

Update: 2026-07-29 19:38 GMT

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నెక్ట్స్ ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. విద్యామంత్రి రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్రస్థాయి ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టగా, ఆ తర్వాత సీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్న విషయమే విస్తృత చర్చకు దారితీసింది. యువత సమస్యలపై వెన్నుచూపని పోరాటం చేసిన సీజేపీ తొలిసారిగా కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. తమ డిమాండ్లను వంద శాతం పరిష్కరించేలా కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయిన సీజేపీ నేతలపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో నీట్ ఉద్యమం ముగిసిన తర్వాత సీజేపీ ప్రయాణంపై ఆసక్తికర చర్చ కొనసాగింది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా తాజాగా సీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నీట్ పేపరు లీక్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో అపూర్వ విజయం సాధించిన సీజేపీ తన నెక్ట్స్ టార్గెట్ రైతుల సమస్యలేనని వెల్లడించింది. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతు ఉద్యమానికి బుధవారం సీజేపీ మద్దతు ప్రకటించింది. గతంలో తమ పోరాటానికి రైతులు మద్దతుగా నిలిచారని, వారిచ్చిన సహకారం, నైతిక మద్దతుతో తాము విజయవంతమయ్యామని సీజేపీ నేతలు చెబుతున్నారు. తమకు చేసిన సాయానికి కృతజ్ఞతగా అన్నదాతల ఆందోళనలకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా బాసటగా నిలవాలని నిర్ణయించుకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ తాజా పరిణామం కేంద్ర ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారేలా కనిపిస్తోందని అంటున్నారు.

నీట్ పేపర్ లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగ సమస్యలపై జంతర్ మంతర్ వేదికగా యువత చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన అభిజీత్ దిప్కే నేతృత్వంలోని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్ధృతికి కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ యువజన ఉద్యమం తాత్కాలికంగా విజయవంతం అయినప్పటికీ, దీని తదుపరి రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ నెక్ట్స్ స్టెప్ ఉద్యోగాల సాధనే అంటూ అభిజిత్ దీప్కే చెప్పినప్పటికీ అంతకన్నా ముందు రైతులకు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది.

రైతులతో జట్టు కట్టడం వెనుక వ్యూహం

ఈ తరుణంలో సీజేపీ నేతలు రైతుల పోరాటాలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమ సమయంలో పలువర్గాలు వారికి మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు అదే రీతిలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలపై గళం విప్పేందుకు సీజేపీ ముందుకు రావడం గమనిస్తే ఢిల్లీ కేంద్రంగా మరో భారీ ఉద్యమానికి అడుగులు పడుతున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతను ఏకం చేయడంలో, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఇప్పుడు రైతుల సమస్యలను భుజానకెత్తుకోవడం ద్వారా తన పరిధిని విస్తృతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి రాజీనామాతో తొలిసారిగా ఇరుకున పడిన కేంద్ర మోదీ ప్రభుత్వానికి రైతులకు మద్దతుగా సీజేపీ మరింత దూకుడు పెంచితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News