కోల్‌గేట్ కుంభకోణంపై సుప్రీం కీలక తీర్పు.. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ కు విముక్తి!

కేసు ఎత్తివేయాలని సీబీఐ క్లోజర్ రిపోర్ట్ సమర్పించినప్పటికీ, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భారత్ పరాశర్ నిరాకరించడం సంచలనమైంది.

Update: 2026-07-29 19:38 GMT

జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కోల్ బ్లాక్ కేటాయింపుల (కోల్‌గేట్) కుంభకోణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌పై నమోదైన కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌లను సుప్రీంకోర్టు సమర్థించింది. మాజీ ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వెలువడిన తీర్పు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో అధికార, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షానికి చెందిన మాజీ ప్రధానికి క్లీన్ చిట్ దక్కడంతో సభలో మరింత దూకుడుగా పోరాటడానికి ఉపయోగపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మన్మోహన్ కు బొగ్గు మసి

2005 సంవత్సరంలో ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్‌ను హిందాల్కో కంపెనీకి కేటాయించిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయని అప్పటి విపక్షం తీవ్ర ఆరోపణ చేసింది. ఆ సమయంలో ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ వద్దే బొగ్గు గనుల శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది. దీంతో బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలకు మన్మోహన్ దే బాధ్యత అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నిబంధనలు ఉల్లంఘించారని మాజీ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అప్పట్లో పెద్దయెత్తున దుమారం రేగింది.

ఇక విపక్షాల ఆందోళనలు, విమర్శలతో అప్పటి యూపీఏ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌ ప్రమేయంపై లోతుగా విచారణ జరిపింది. అయితే, మన్మోహన్ కుట్ర చేశారనేందుకు కానీ, అవినీతికి పాల్పడినట్లు గానీ ఆధారాలు లభించలేదని సీబీఐ తేల్చిచెప్పింది. దీనితో సీబీఐ 2014లో (ఆగస్టు 27, అక్టోబర్ 21 తేదీల్లో) రెండుసార్లు ప్రత్యేక కోర్టులో మన్మోహన్ పై కేసు ఎత్తివేయాల్సిందిగా (క్లోజర్ రిపోర్ట్‌) అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిద్వారా మాజీ ప్రధానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.

ట్రయల్ కోర్టు షాకింగ్ నిర్ణయం

కేసు ఎత్తివేయాలని సీబీఐ క్లోజర్ రిపోర్ట్ సమర్పించినప్పటికీ, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భారత్ పరాశర్ నిరాకరించడం సంచలనమైంది. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులను పక్కనపెట్టి ప్రధాని హోదాలో ఈ కేటాయింపు జరగడం వల్ల ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూరిందని భావించి, 2015 మార్చి 11న మన్‌మోహన్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మన్‌మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015 ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే విధించింది. అప్పటి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో నలుగుతూ వచ్చింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు

ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ మన్‌మోహన్ సింగ్ డిసెంబర్ 2024లో కన్నుమూశారు. ఆయన మరణించినప్పటికీ, ఆయనపై కోర్టు చేసిన వ్యాఖ్యలు, విచారణ కొనసాగుతున్నందున ఈ అప్పీలును కేవలం నిరర్థకమైనదిగా కొట్టివేయకుండా కేసు మెరిట్స్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించింది. సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌లను తోసిపుచ్చేందుకు, అప్పట్లో ట్రయల్ కోర్టుకు ఎలాంటి బలమైన లేదా సరైన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదికను కొట్టివేసి నిందితుడిగా పరిగణించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ 2015 మార్చి 11 నాటి ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌లను ఆమోదిస్తూ, మన్‌మోహన్ సింగ్‌పై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను పూర్తిగా ముగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మన్‌మోహన్ సింగ్‌పై కోల్ బ్లాక్ కేటాయింపులకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న విచారణ ముగిసినట్లైందని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని హోదాలో మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు కేవలం పరిపాలనాపరమైనవేనని, వాటిలో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని న్యాయస్థానం తేల్చిచెప్పిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News