ఎమ్మెల్యే బొండాకు పరోక్ష హెచ్చరికలు... ఆసక్తికరంగా మంత్రి నిమ్మల వ్యాఖ్యలు

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా రేపిన తుఫాన్ ను చల్లార్చేలా అధిష్టానం అడుగులు వేస్తోంది.

Update: 2026-07-29 19:45 GMT

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా రేపిన తుఫాన్ ను చల్లార్చేలా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్యే వివరణ తీసుకున్న ద్విసభ్య కమిటీ బుధవారం ఆ వివరాలను వెల్లడించింది. ఎమ్మెల్యేతో మాట్లాడాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును అధినేత చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఉమా వివరణ తీసుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతానికి వివాదం సమసిపోయినట్లేనని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలే కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే బొండా ఉమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ పార్టీ క్రమశిక్షణ విషయంలో కట్టు తప్పితే వేటు తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై చెలరేగిన వివాదంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా స్పష్టతనిచ్చారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన అంశంపై బొండా ఉమా చేసిన వ్యాఖ్యలను కొన్ని దుష్ట శక్తులు సామాజిక మాధ్యమాల్లో వక్రీకరించాయని తెలిపారు. ఈ అంశంపై బొండా ఉమా ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పూర్తి వివరణ ఇచ్చారని, ఆయన ఇచ్చిన వివరణపై హైకమాండ్ సంతృప్తి చెందిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అయితే రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై మంత్రి నిమ్మల చేసిన హెచ్చరికలు పరోక్షంగా ఎమ్మెల్యే బొండా ఎపిసోడ్ ను గుర్తు చేసేలా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నియమాలు, సిద్ధాంతాలు ఏ స్థాయి నాయకుడికైనా సమానంగా వర్తిస్తాయని మంత్రి తేల్చిచెప్పారు. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని హితవు పలికారు. పార్టీ లైన్‌ను దాటినా, పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినా ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనిద్వారా ఎమ్మెల్యే బొండా ఉమా విషయంలో ప్రస్తుతానికి పార్టీ వెనక్కి తగ్గినట్లు వ్యవహరించినా, ఇకపై ఇదే విధంగా ఉండదని తేల్చిచెప్పారని అంటున్నారు.

మొత్తానికి మంత్రి నిమ్మల వ్యాఖ్యలతో టీడీపీ అంతర్గత రాజకీయాలపై మరోసారి హాట్ డిబేట్ జరుగుతోంది. పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా విషయంలో పార్టీ సీరియస్ గానే ఉందని మంత్రి వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి వివాదాన్ని పెద్దది చేయకుండా ముగించాలనే ఆలోచనతో ఆయన నుంచి వివరణ తీసుకుని సరిపెట్టారని భావిస్తున్నారు. ఎమ్మెల్యే బొండాను రెచ్చగొట్టేలా ఏ నిర్ణయం తీసుకున్నా, అనవసర చర్చకు తావిచ్చినట్లు అవుతుందన్న ఆలోచనతోనే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో గతంలో ఎమ్మెల్యే బొండా పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుని ఒక చాన్స్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేసిందని అంటున్నారు. అయితే తాను ఏం అన్నా చెల్లుతుందనే భావన అటు ఎమ్మెల్యేలోను ఇటు మిగిలిన నేతల్లోనూ పెరగకుండా ఉండేందుకు మంత్రి నిమ్మలతో వార్నింగ్ ఇప్పించారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News