టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిని టార్గెట్ చేసిన రష్యా
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా ప్రభుత్వం సంచలన చర్యలకు దిగింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయడమే కాకుండా అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా చేర్చినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్.ఎస్.బీ) ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, సోషల్ మీడియా రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశంలోని ఇంటర్నెట్ సేవలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన నియంత్రణలు అమలు చేస్తున్న రష్యా ప్రభుత్వం.. ఇప్పుడు టెలిగ్రామ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన నిఘా సంస్థలు, రష్యా వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్‌లోని ఛానళ్లు, గ్రూపులు, చాట్‌బాట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఎఫ్‌ఎస్‌బీ ఆరోపిస్తోంది. వీటి ద్వారా సైబర్ దాడులు, విద్రోహ చర్యలు, నిధుల సమీకరణ, సమాచార మార్పిడి జరుగుతోందని పేర్కొంది.
ఈ ఆరోపణల నేపథ్యంలో రష్యన్ క్రిమినల్ కోడ్‌లోని ఆర్టికల్ 205.1 కింద పావెల్ దురోవ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరాలు రుజువైతే ఆయనకు జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో దురోవ్‌ను అంతర్జాతీయంగా వెతకాలని రష్యా చర్యలు ప్రారంభించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఈ ఆరోపణలను పావెల్ దురోవ్ పూర్తిగా ఖండించారు. ప్రజల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడానికి, భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయడానికి రష్యా ప్రభుత్వం భద్రత పేరుతో ఒత్తిడి తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు. టెలిగ్రామ్ వినియోగాన్ని పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రష్యాలో పెరుగుతున్న ఆంక్షల కారణంగానే తాను దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గతంలో కూడా దురోవ్ వెల్లడించారు.
ఇటీవల కాలంలో రష్యా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై పూర్తి నియంత్రణ సాధించే దిశగా వరుస చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలను నిషేధించింది. వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగంపైనా పలు పరిమితులు విధించింది. వీటి స్థానంలో ప్రభుత్వం 'మాక్స్' అనే స్వదేశీ మెసేజింగ్ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే ఆ యాప్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వ భద్రతా సంస్థలకు చేరుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పావెల్ దురోవ్ చుట్టూ వివాదాలు కొత్తవి కావు. 2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కూడా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్ వేదికగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన చిత్రాల వ్యాప్తి, ఇతర నేర కార్యకలాపాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై అక్కడ విచారణ కొనసాగుతోంది. ఆ కేసు ఇంకా పూర్తిగా ముగియకముందే ఇప్పుడు రష్యా ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న టెలిగ్రామ్ భవిష్యత్తుపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు భద్రతా కారణాలను చూపుతున్న ప్రభుత్వాలు, మరోవైపు గోప్యత , భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని వాదిస్తున్న టెక్నాలజీ సంస్థల మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.