రాహుల్ ప్లేస్ లో ప్రియాంక బెటర్...బీజేపీ మంత్రి
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని కోరుతూ చేపట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.;
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని కోరుతూ చేపట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ చర్చలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం పెద్ద ఎత్తున సాగింది. ఎన్ డీయే నుంచి పండిట్ నెహ్రూ ని పొగుడుతూ మాట్లాడడం ఒక ఆశ్చర్యం అయితే ప్రియాంక విపక్ష నేతగా బాగా సూట్ అవుతారు అని అధికార పక్షమే సూచించడం మరో హైలెట్. అయితే ఎన్డీయే నుంచి వచ్చిన వ్యాఖ్యలను అంతే దూకుడుగా ప్రియాంకాగాంధీ ఖండిస్తూ రివర్స్ ఎటాక్ చేయడం విశేషం.
విపక్ష నేతగా ఆమె :
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున విపక్ష నేతగా ప్రియాంకా గాంధీకి అవకాశం ఇస్తే బాగుండేది అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన కామెంట్స్ లోక్ సభలో మంట పుట్టించాయి. ప్రియాంక సభలో ఉంటారు, ఆమె అన్నీ వింటారు అని కిరణ్ రిజిజు చెప్పడం గమనార్హం. అందుకే ఆమెకే కీలక పదవి ఇచ్చి ఉండాల్సింది అని ఆయన సూచించారు. అమె మంచి పనితీరుని చూపించేవారు అని ఆయన చెప్పడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించేదే.
నెహ్రూ గురించి చెబుతూ :
ఇక దేశానికి తొలి ప్రధానిగా చేసిన పండిట్ నెహ్రూ తన హయాంలో 1954లో అప్పటి లోక్‌సభ స్పీకర్ జీవి మౌలంకర్‌ను తొలగించే సందర్భంగా ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా కిరణ్ రిజిజు సభ దృష్టికి తెచ్చారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభ్యులు దానిని చదివి సంతకం చేసి ఉండాల్సింది అని నెహ్రూ అన్నారని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. స్పీకర్ మీద అవిశ్వాసం దుర్మార్గం అని నెహ్రూ అన్నారని ఆయన చెబుతూ కాంగ్రెస్ ని ఎత్తి పెడిచారు.
ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు :
ఎపుడూ నెహ్రూని మెచ్చుకోని ఎన్డీయే ప్రభుత్వం ఇపుడు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలను సభలో పెట్టి పొగుడుతోందని ప్రియాంకా గాంధీ విమర్శించారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ఆమె అంటూ ఆయన వ్యాఖ్యలను అధికార పక్షం ఇలా వాడుకోవడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ మంచి నాయకుడని ఆమె చెబుతూ ఆయన వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు లేదని నిందించారు. అమెరికా ముందు కేంద్ర ప్రభుత్వం తల వంచింది అని ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ప్రశ్నలకు జవాబులు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని ప్రశ్నించారు.
విపక్షాలకు చాన్స్ :
ఇక ఈ చర్చ ఏకంగా పది గంటలకు పైగా సాగుతూనే వచ్చింది. ఈ క్రమంలో అధికార పక్షం నుంచి సభ్యులు మాట్లాడుతూ బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు. జీరో అవర్‌లో అత్యధిక సంఖ్యలో విషయాలు ఓం బిర్లా హయాంలోనే వచ్చాయని చెప్పారు. బిర్లా నాయకత్వంలో పార్లమెంటును పూర్తిగా డిజిటల్ మరియు పేపర్‌లెస్‌గా మార్చామని చెప్పారు. బిర్లా నాయకత్వంలో 18వ లోక్‌సభలో ఎన్ డీయే ఎంపీలకు 321 అనుబంధ ప్రశ్నలు ఇవ్వగా, ప్రతిపక్ష పార్టీలకు 364 ప్రశ్నలు ఇచ్చారని మరి విపక్షం పట్ల వివక్ష ఎక్కడ ఉందని అధికార సభ్యులు నిలదీశారు. ఓం బిర్లా ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారని అన్నారు.