విజయ్ గేమ్ బూమరాంగ్

తమిళనాట భారీ అంచనాల మధ్య రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు విజయ్;

Update: 2026-03-10 16:30 GMT

తమిళనాట భారీ అంచనాల మధ్య రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు విజయ్. జయలలిత మరణానంతరం తమిళనాట ఏర్పడ్డ ఖాళీని అతను ఉపయోగించుకుంటాడని.. తన ఫాలోయింగ్‌ను ఓట్లుగా మలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదగగలడని.. అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కాగలడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ విజయ్‌కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నట్లే కనిపించినా.. రాజకీయ పరంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో తన ప్రభావం అంతకంతకూ తగ్గిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గత ఏడాది కరూర్ తొక్కిసలాట ఘటన కారణంగా విజయ్‌కి పెద్ద బ్రేక్ పడింది. ఆ వ్యవహారం అతణ్ని ఆత్మరక్షణలోకి నెట్టింది. తన రాజకీయ కార్యకలాపాలు కొంత కాలం నెమ్మదించాయి. దీన్నుంచి కోలుకుని, జనాల దృష్టిని కూడా మళ్లించి విజయ్ యాక్టివ్ అయ్యాడు. తన అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

కానీ ఇంతలో ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు రెండు నెలలు కూడా లేని సమయంలో విజయ్ భార్య సంగీత.. అతడిపై అనేక ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఈ విషయంలో విజయ్ ఆచితూచి అడుగులు వేయాల్సిందేమో. కానీ అక్రమ సంబంధం గురించి సంగీత చేసిన ఆరోపణలను నిజం చేస్తూ త్రిషతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యాడు విజయ్. రాబోయే రోజుల్లో సంగీత ఇంకా పలు ఆరోపణలు చేస్తుందని.. త్రిషతో తన బంధం గురించి రాజకీయ ప్రత్యర్థులు తనను టార్గెట్ చేస్తారని ఊహించి.. జరగబోయే డ్యామేజ్‌ను నివారించడానికే విజయ్ ఇలా వ్యూహాత్మకంగా త్రిషతో కలిసి బయటికి వచ్చాడనే వాదన వినిపించింది.

కానీ ఇప్పుడు విజయ్ చేసిన పనితోనే ఎక్కువ డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు రోజుల పరిణామాలను బట్టి చూస్తే విజయ్ చర్య.. అతడికి పూర్తిగా ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. స్వయంగా సినీ పరిశ్రమ నుంచే అనేక మంది విజయ్‌, త్రిష కలిసి రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విజయ్ అభిమానుల్లో కూడా దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కుటుంబం పట్ల బాధ్యతగా లేని వ్యక్తిని రాజకీయాల్లో అంగీకరించరని.. సంగీతను బాధితురాలిగా చూస్తున్న మహిళలు విజయ్ పట్ల వ్యతిరేక అభిప్రాయానికి వస్తారని.. ఇది అంతిమంగా అతడికి బాగా డ్యామేజ్ చేసే విషయమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News