రేవంత్ రెడ్డి జిల్లాల బాట.. రీజనేంటి?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొరట-చనాక్ బ్యారేజ్ నుంచి నీటి విడుదల పనులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల బాట పడుతున్నారు. గత డిసెంబరులో కూడా ఆయన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. సభలు, సమావేశాలు పెట్టారు. దీనికి కారణం.. పంచాయతీ ఎన్నికలే. ఇప్పుడు కూడా అదే కారణంగా ఆయన జిల్లాల బాట పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. దీనిని దృష్టిలో పెట్టుకు ని.. నోటిఫికేషన్ రాకముందే.. ఆయన అలెర్ట్ అవుతున్నారు.
కోడ్ రాకముందే.. చక్కబెట్టేందుకు.. కొన్ని కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన వరుస జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు.. జిల్లాల్లోనే పర్యటించనున్నారు. అయితే.. కేవలం జిల్లాల పర్యటనలో మొహం చూపించి వచ్చేయడం కాకుండా.. పలు కీలక ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొరట-చనాక్ బ్యారేజ్ నుంచి నీటి విడుదల పనులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు. ఇది.. గత ఏడాది కాలంలో పూర్తయింది. దీనిని ప్రారంభించడం ద్వారా ఆదిలాబాద్ రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల చేపట్టిన అభివృధ్ధి పనులతో పాటు రహదారుల నిర్మాణానికి కూడా సీఎం శ్రీకారం చుడతారు. అలాగే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ సీఎం రేవంత్ పర్యటిస్తారు. ఇక, సోమవారం.. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈలోగానే ఆయా జిల్లాల్లో.. ముఖ్యంగా కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లాల్లో సీఎం పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.