కీమో, సర్జరీ లేకుండానే క్యాన్సర్ చెక్… 4 నెలల్లో అద్భుత ఫలితం

చాలా మంది క్యాన్సర్ రోగులు వ్యాధి కంటే కూడా చికిత్స సమయంలో పడే బాధకే ఎక్కువగా భయపడుతుంటారు.;

Update: 2026-03-06 17:16 GMT

క్యాన్సర్ అంటేనే ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా, నయం కావడానికి ఎన్నో ఏళ్లు పట్టే సమస్యగా చూసేవాళ్ళం. కానీ, వైద్య రంగం సాధించిన పురోగతి తో ఇప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుత చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఎంతో బాధాకరమైన కీమోథెరపీ, రేడియేషన్ లేదా శరీరానికి కోతలు పెట్టే సర్జరీల అవసరం లేకుండానే రెక్టల్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. 26 ఏళ్ల ఓ యువతిపై జరిగిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది..ఆ వివరాలు చూద్దాం ..

ఇమ్యునోథెరపీ మ్యాజిక్.. క్యాన్సర్‌పై మన బాడీయే యుద్ధం:

సాధారణంగా క్యాన్సర్ చికిత్స అంటే కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోవడం, విపరీతమైన నీరసం వంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగిన 'ఇమ్యునోథెరపీ' విధానం చాలా భిన్నమైనది. ఇది నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేయదు, దానికి బదులుగా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతుంది. ఇక అలా బలోపేతమైన మన బాడీయే స్వయంగా క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని వెతికి మరీ అంతం చేస్తుంది. ఈ పద్ధతిలో కేవలం నాలుగు నెలల చికిత్సతోనే ఆ యువతి శరీరంలోని మలనాళ క్యాన్సర్ ఆనవాళ్లు లేకుండా మాయమవ్వడం విశేషం.

సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. సర్జరీ అసలే లేదు:

చాలా మంది క్యాన్సర్ రోగులు వ్యాధి కంటే కూడా చికిత్స సమయంలో పడే బాధకే ఎక్కువగా భయపడుతుంటారు. రేడియేషన్ వల్ల చర్మం కాలిపోవడం, సర్జరీ తర్వాత కోలుకోవడానికి పట్టే సమయం వంటి ఇబ్బందులేవీ ఈ కొత్త చికిత్సలో ఉండవు. ఇక కేవలం ఇంజక్షన్లు లేదా టాబ్లెట్ల రూపంలో ఇచ్చే ఈ థెరపీ వల్ల శరీరంపై ఎలాంటి కోతలు ఉండవు. ఆ యువతికి చేసిన పరీక్షల్లో క్యాన్సర్ గడ్డలు పూర్తిగా కరిగిపోయాయని, భవిష్యత్తులో కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది క్యాన్సర్ చికిత్స చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

అందరికీ అందుబాటులోకి వస్తుందా:

ప్రస్తుతానికి ఈ చికిత్స కొన్ని నిర్దిష్ట రకాల క్యాన్సర్లకు, అది కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ, రాబోయే రోజుల్లో సాంకేతికత పెరిగే కొద్దీ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కీమో, రేడియేషన్ భయంతో చికిత్సకు దూరంగా ఉండే వారికి ఇమ్యునోథెరపీ ఒక వరమని చెప్పవచ్చు. వైద్యులు మరిన్ని పరిశోధనలు చేసి, అన్ని రకాల క్యాన్సర్లను ఇలాగే సులభంగా నయం చేసే రోజు కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.



Tags:    

Similar News