పశ్చిమ వైసీపీలో సెగలు.. ఏం జరుగుతోంది.. ?
జిల్లాలో పార్టీ కేడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఎక్కడా పార్టీలో తమకు దన్నుగా నిలబడే నాయకులు లేక పోవడంతో కార్యకర్తలు పూర్తిస్థాయిలో డీలా పడ్డారు.;
ఒక నియోజకవర్గంలో సమస్య ఉంటే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఒక నగరంలో సమస్య ఉంటే ఇప్పుడు కాకపోతే.. ఎన్నికల సమయానికి అయినా.. పరిష్కారం అవుతుంది. కానీ, ఒక జిల్లా వ్యాప్తంగా సమస్య ఎదురైతే.. ఇదే.. ఇప్పుడు వైసీపిని కలవర పెడుతోంది. జిల్లాలో పార్టీ కేడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఎక్కడా పార్టీలో తమకు దన్నుగా నిలబడే నాయకులు లేక పోవడంతో కార్యకర్తలు పూర్తిస్థాయిలో డీలా పడ్డారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పట్టించుకునే నాయకులు లేకపోవడం ఇప్పుడు వైసీపీకి శరాఘాతంగా మారిందని అంటున్నారు. ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన.. ఆళ్ల నాని.. పార్టీ మారిపోయారు. ఇక, ఇతర నాయకుల విషయానికి వస్తే... మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బయటకు కూడా రావడం లేదు. ఆయనపై కేసులు ఉన్నాయి పైగా సిట్‌కే లంచం ఇచ్చారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక, చింతలపూడిలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అదేవిధంగా కీలక నియోజకవర్గం దెందులూరులోనూ.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సైలెంట్ అయ్యారు.
తాడేపల్లిగూడెం కొత్త ఇన్‌చార్జ్ వడ్డి రఘురామ్‌కు మాజీ మంత్రి కొట్టుతో పాటు కొందరు కేడర్ సహకరించడం లేదు. ఈ పరిణామాలు పార్టీపైనే కాకుండా.. కార్యకర్తలపైనా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీలో ఉన్నా .. తమకు ఎలాంటి దిశానిర్దేశం చేసేందుకు నాయకులు ముందుకు రావడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పుంజుకునేందుకు అవకాశం ఉన్నా.. పార్టీ వదులుకుంటోందని పలువురు క్షేత్రస్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా చెబుతున్నారు. ''అవకాశం ఉండి కూడా వదులుకుంటున్నాం'' అని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల తర్వాత.. నాయకులు పూర్తిగా సైలెంట్ అయ్యారు. మాజీ మంత్రులు కూడా తమపై ఆరోపణలు ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా.. ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడే వారే లేకుండా పోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఇలానే కొనసాగితే.. కార్యకర్తలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారన్న చర్చ తెరమీదికి రావడం గమనార్హం.