జైలు కెళ్తే చాలు టికెట్ గ్యారంటీనా ?
వైసీపీ నేతలు ఎవరైనా అరెస్టు అయితే ఆ పార్టీ అధినాయకత్వం నుంచి భారీ రియాక్షన్ వస్తోంది. నేరుగా జగన్ ట్వీట్ చేస్తున్నారు.
వైసీపీలో ఇపుడు కొత్త చర్చ సాగుతోంది. పార్టీ కోసం జనంలో ఉండి పోరాడామని ఎవరు చెప్పినా దానికి అధికారిక పత్రం ఏమి ఉంటుంది అన్నదే అంతా అనుకుంటారు. అదే ఏదో విధంగా జనంలోకి వచ్చి పోరాటాలు చేస్తే ఆ మీదట ఎటూ పోలీసులు కేసు కడతారు, అలా అరెస్టు అయి జైలు పాలు అయితే అది నేరుగా అధినాయకత్వం దృష్టిలోకి వెళ్తుందని తప్పకుండా అలాంటి వారికే టికెట్ దక్కుతుందని అంటున్నారు. వైసీపీలో ఈ అరెస్టులు జైళ్ళు ఇలా ఎంతో మంది నాయకులు గత రెండేళ్ళుగా ఎదుర్కొంటూ వచ్చారు, ఇపుడు మరింత మంది జైలులో ఉన్నారు, ఇంకొంతమంది జైలుకు వెళ్ళే బాటలో ఉన్నారని అంటున్నారు.
భారీ రియాక్షన్ తో :
వైసీపీ నేతలు ఎవరైనా అరెస్టు అయితే ఆ పార్టీ అధినాయకత్వం నుంచి భారీ రియాక్షన్ వస్తోంది. నేరుగా జగన్ ట్వీట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు కూడా అందులో చేస్తున్నారు. అంతే కాదు వారికి పరామర్శలు ఆ మీదట భారీ ప్రచారం వంటివి వెంటవెంటనే జరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు అరెస్టు అయితే జగన్ పరామర్శకు జైలు దాకా వెళ్ళి వచ్చారు. ఆ తరువాత కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్టు చేశారు. ఇపుడు శ్రీకాకుళంలో ఆముదాలవలస ఇంచార్జి చింతాడ రవి కుమార్ ని అరెస్టు చేశారు. దీంతో వైసీపీ నేతలు అంతా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అధినాయకత్వం కూడా దీని మీద ఘాటుగా స్పందించింది.
ఆయనకే ఖాయమా :
ఆముదాలవలస అంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అందరికీ గుర్తుకు వస్తారు. అలాంటి చోట 2024 ఎన్నికల తరువాత వైసీపీ అధినాయకత్వం చేసిన మార్పులలో భాగంగా యువ నేత అయిన చింతాడ రవికుమార్ కి ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. ఆయన నాటి నుంచి పార్టీని యాక్టివ్ గా చేస్తున్నారు. జగన్ తాజా శ్రీకాకుళం పర్యటనలో ఆయన భారీ జనాలతో తరలి వచ్చారు. ఈ సందర్భంగానే మహిళా ఎస్సైతో జరిగిన గొడవలో ఆయనను అరెస్టు చేశారు. ఇక ఇపుడు ఆయనకు ఆముదలవలస టికెట్ ఖరారు అయినట్లే అని అంటున్నారు. మరో వైపు భూ కబ్జా ఆరోపణల మీద మాజీ స్పీకర్ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. దాంతో కూడా చింతాడ రవి కుమార్ కి కలసి వచ్చింది అని అంటున్నారు.
పోరాడితేన ఫలితం :
కూటమి మీద నేరుగా పోరాటాలు చేసి అరెస్టు దాకా పరిస్థితిని తెచ్చుకుంటేనే వారు పని చేస్తున్నట్లుగా లెక్క అని అంటున్నారు. ఆ విధంగా వ్యవహరించిన వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కేసులకు భయపడో లేక తమ వ్యాపారాలు దెబ్బ తింటాయనో ఎవరైనా వెనకన ఉంటే వారు పార్టీలోనూ వెనకబడినట్లే అని సందేశాన్ని అధినాయకత్వం పంపిస్తోంది అని అంటున్నారు. పార్టీ ప్రస్తుతం కష్ట కాలంలో ఉంది అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ముందుకు వచ్చి పనిచేసిన వారికే పట్టం కట్టాలన్నదే హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ విధంగా వైసీపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంత మంది నేతలు ఉన్నారన్నది కూడా ఒక అంచనా కడుతున్నారు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం పార్టీ కోసం దూకుడుగా రాజకీయం చేసే వారికే చాన్స్ అని కూడా చెబుతున్నారు.