ఢిల్లీలో హైఅలర్ట్... ఆగస్టు 15 మీద ఉగ్ర కన్ను ?
మన దేశానికి స్వాతంత్ర్యం లభించి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అక్షరాలా 80 ఏళ్ళు పూర్తి అవుతాయి.
మన దేశానికి స్వాతంత్ర్యం లభించి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అక్షరాలా 80 ఏళ్ళు పూర్తి అవుతాయి. అందువల్ల ఈసారి స్వాతంత్ర్య వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏటా మాదిరిగానే అంగరంగ వైభవంగా మువ్వన్నెల్ల జెండా పండుగను జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఎప్పటి మాదిరిగా ఉంటుంది. మొత్తం కేంద్ర మంత్రులతో పాటు ప్రభుత్వం అంతా అక్కడే ఉంటుంది. అలాగే విపక్ష నేతలతో పాటు వీవీఐపీలు అంతా అక్కడే ఉంటారు. దాంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ఉగ్ర ముప్పు నేపధ్యంలోనే :
ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మక వేడుక మీద ఉగ్ర కన్ను కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. ఇక ఆగస్ట్ 15 నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ని జారీ చేశారు. అంతే కాదు ఉగ్ర ముప్పు నేపథ్యంలో భారీ మాక్ డ్రిల్ ని కూడా నిర్వహించారు. అలాగే సుదర్శన్ శక్తి- వీ పేరుతో కౌంటర్ టెర్రర్ డ్రిల్ ని కూడా చేపడుతున్నారు. ఎన్ ఎస్జీ, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ ని నిర్వహించారు. అంతే కాకుండా ఎర్రకోట సహా ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భారీ భద్రతని పటిష్టం చేశారు.
అత్యంత కట్టుదిట్టంగా :
ఈసారి ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోటతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. భద్రతా ఏర్పాట్లు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నిఘా తీవ్రం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రదేశాలు, రవాణా కేంద్రాల వద్ద తనిఖీలు పెంచారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులు హైలెవల్ సమావేశాలు నిర్వహించి సమన్వయ చర్యలు సమీక్షిస్తున్నారు.
వారే విశిష్ట అతిధులుగా :
ఇదిలా ఉంటే దేశ అభివృద్ధిలో వివిధ రంగాల ద్వారా భాగస్వాములైన వేలాది మంది ప్రత్యేక వ్యక్తులను ఢిల్లీ ఎర్ర కోట వద్ద జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, యువజన స్వచ్ఛంద కార్యకర్తలు, కార్మికులు తదితరులు ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రసంగం మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది అని అంటున్నారు.
మోడీ రికార్డు :
ఇక ఎర్ర కోట ప్రసంగాలలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన రికార్డుని క్రియేట్ చేశారు. ఆయన 2014 నుంచి 2025 దాకా చూస్తే ఇప్పటికి 12 సార్లు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఆ విధంగా ఆయన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రికార్డును దాటారు. అయితే అత్యధికంగా ఎర్ర కోట ప్రసంగాలు చేసిన రికార్డు అయితే ఈ రోజుకీ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరు మీదనే ఉంది. ఆయన వరుసగా 17 ప్రసంగాలు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ వరుసగా 12 ప్రసంగాలు చేసి రెండో స్థానంలో ఉన్నారు. ఆయన 2029 దాకా ప్రధానిగా కొనసాగుతారు కాబట్టి ఈ మూడవ టెర్మ్ తో కూడా కలుపుకుంటే మొత్తం 15 సార్లు ఎర్ర కోట మీద ప్రసంగాలు చేసిన వారుగా ఉంటారు. అంటే నెహ్రూకి అతి సమీపంలోకి వస్తారు అన్న మాట. 2029 మేలో జరిగే ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే మోడీ నాలుగోసారి ప్రధాని అయితే నెహ్రూ రికార్డుని కూడా దాటేసేందుకు అవకాశం ఉంటుంది.