యూఏఈలో భారతీయ ఎన్నారై దారుణ హత్య: 9 ముక్కలుగా నరికి కారులో పడేసిన వైనం.. భార్య, కుమారుడు మిస్సింగ్!

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2026-09-23 09:35 GMT

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివాసముంటున్న కర్ణాటకకు చెందిన ఓ భారతీయ ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. ఉడుపి జిల్లాకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ (38) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత అమానుషంగా హత్య చేసి ఆయన మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి రెండు సంచుల్లో కుక్కి కారులో పడేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?

ఉడుపికి చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ గత 14 సంవత్సరాలుగా షార్జా విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య టీనా ఓ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా వీరికి పదో తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. జులై నెలలో ఈ కుటుంబం షార్జా నుంచి భారత్‌కు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే జులై 20న అల్విన్ సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఆయనకు ఫోన్ చేయగా కాల్ ఎత్తకుండా కేవలం ఒక టెక్స్ట్ మెసేజ్ మాత్రమే వచ్చింది. సాధారణంగా ఎప్పుడూ వాయిస్ మెసేజ్ పంపే అల్విన్.. ఆ రోజు భిన్నంగా మెసేజ్ చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనిల్ షార్జాలోని అల్విన్ స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని పంచుకున్నారు. ఆ స్నేహితుడు అల్విన్ నివాసానికి వెళ్లి వాచ్‌మన్‌ను విచారించగా.. ఆ కుటుంబం ఇప్పటికే భారత్‌కు వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే అల్విన్ పనిచేస్తున్న సంస్థ హెచ్‌ఆర్ విభాగాన్ని సంప్రదించి, పాస్‌పోర్టు ప్రయాణ వివరాలను పరిశీలించగా ఆయన యూఏఈ వదిలి వెళ్లలేదని నిర్ధారణ అయింది.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఉడుపి పోలీసులను ఆశ్రయించడంతో పాటు, అక్కడ మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేయించారు. స్థానిక పోలీసులు, యూఏఈ అధికారుల సహాయంతో దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒమన్ హైవే వైపు పార్క్ చేసి ఉన్న ఒక అనుమానాస్పద కారులో అల్విన్ మృతదేహ భాగాలు లభ్యమయ్యాయి. దుండగులు ఆయన శరీరాన్ని 9 భాగాలుగా ఖండించి, రెండు వేర్వేరు సంచుల్లో నింపి కారులో వదిలేసినట్లు అధికారులు గుర్తించారు.

భార్య, కుమారుడి ఆచూకీ గాల్లోనే

ఈ హత్య కేసులో మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. హత్య జరిగినప్పటి నుంచి అల్విన్ భార్య టీనా, వారి కుమారుడు కనిపించకుండా పోయారు. వారిద్దరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఈ దారుణంలో వారి ప్రమేయం ఏదైనా ఉందా లేదా వారు కూడా ప్రమాదంలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అల్విన్ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం యూఏఈ అధికారులు, కర్ణాటక పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? భార్యాపిల్లలు ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు పోలీసుల పూర్తి నివేదిక వచ్చాకే స్పష్టత రానుంది.

Tags:    

Similar News