యనమల కృష్ణుడిని ఆపుతున్నదెవరు? జనసేనలో రెడ్ సిగ్నల్

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాల్లో కుప్పిగెంతులు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తున్న అధికార కూటమి కీలక నేతలకు వల వేస్తోంది.

Update: 2026-09-23 10:20 GMT

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాల్లో కుప్పిగెంతులు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తున్న అధికార కూటమి కీలక నేతలకు వల వేస్తోంది. ఈ విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ఉత్తరాంధ్రలో టీడీపీ, గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరగా, తాజాగా అదే జిల్లాలోని తుని నియోజకవర్గ నాయకుడు యనమల కృష్ణుడు పేరు ఎక్కువగా వినిపిస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన కృష్ణుడు ఇప్పుడు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, అయితే ఆయనను పార్టీలో చేర్చుకునే విషయంలో జనసేన నేతలే తర్జనభర్జనకు గురవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమీప బంధువు అయిన యనమల కృష్ణుడు 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలోనే ఉండేవారు. అయితే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన కారణంగా గత ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో యనమల కుమార్తె దివ్యను తెరపైకి తీసుకువచ్చింది. దీంతో యనమల కృష్ణుడు టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణుడిని చేర్చుకున్నప్పటికీ ఆ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని చెబుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హవా ఎక్కువగా ఉండటంతో యనమల కృష్ణుడు వైసీపీలో సర్దుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం జనసేనలో చేరాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

జనసేనలో చేరే ఆలోచనతో ఉన్న కృష్ణుడు ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో సంప్రదించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ రెండు రోజుల పర్యటన సందర్భంగా జనసేన కండువా కప్పుకోవాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే ఏం అయిందో కానీ చివరి క్షణంలో కృష్ణుడి చేరికను జనసేన వాయిదా వేసినట్లు చెబుతున్నారు. సోమవారం పిఠాపురం వచ్చిన పవన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతోపాటు యనమల కృష్ణుడు జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో కృష్ణుడి చేరికను శనివారానికి వాయిదా వేసినట్లు పార్టీ వర్తమానం పంపిందని అంటున్నారు.

ఇక జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కృష్ణుడికి చివరి క్షణంలో రెడ్ సిగ్నల్ పడటం తీవ్ర చర్చకు తెరలేపింది. దీంతో ఈ పరిస్థితికి కారణమేమి అయివుంటుందని పరిశీలకులు ఆరా తీస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన నేపథ్యమే ఆయన చేరికకు అడ్డుపడిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది అంతుచిక్కడం లేదని అంటున్నారు. అయితే కృష్ణుడి చేరిక వల్ల జనసేనకు వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోడానికి పార్టీ అధిష్టానం కొంత సమయం తీసుకుందన్న టాక్ నడుస్తోంది. కృష్ణుడి అనుభవం పార్టీకి పనికొస్తుందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆయన చేరిక విషయంలో మిత్రపక్షాన్ని ఒకసారి సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధినేత పవన్ భావించడం వల్లే తాత్కాలిక వాయిదా పడినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News