రో-కో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ట్రై సిరీస్ కన్ఫామ్? ఈ మూడు జట్లు బరిలోకి దిగితే పండగే
అయితే ఇప్పుడు 'రో-కో' ఫ్యాన్స్‌లో సరికొత్త ఆశలు చిగురించేలా ఒక మైండ్ బ్లోయింగ్ వార్త క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారమవుతోంది.
భారత క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు వింటే చాలు అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ప్రస్తుతం టీ20, టెస్టు క్రికెట్‌లకు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ స్టార్ క్రికెటర్ల ఆటను మైదానంలో నేరుగా చూడటానికి అభిమానులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు 'రో-కో' ఫ్యాన్స్‌లో సరికొత్త ఆశలు చిగురించేలా ఒక మైండ్ బ్లోయింగ్ వార్త క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారమవుతోంది.
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు ఘనమైన ప్రాక్టీస్ అందించేందుకు వీలుగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక ప్రత్యేక ట్రై సిరీస్ నిర్వహించే అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతటి పెద్ద మెగా టోర్నీకి ముందు భారత జట్టు అగ్రశ్రేణి జట్లతో ఎక్కువ సంఖ్యలో వన్డే మ్యాచ్‌లు ఆడటం ఎంతో ముఖ్యం. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లతో కలిసి త్రైపాక్షిక సిరీస్ ఆడితే.. అది ప్రపంచకప్ సన్నాహకాలకు అత్యుత్తమ వేదికగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ వార్తపై ప్రస్తుతం అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన భవిష్యత్తు షెడ్యూల్ ప్రకారం 2027 మే నెలలో పాకిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్, ఆ తర్వాత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లు ఖరారై ఉన్నాయి. ఈ క్యాలెండర్‌లో ప్రస్తుతం భారత జట్టుతో ట్రై సిరీస్ ప్రస్తావన లేనప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మండలి , సంబంధిత బోర్డుల మధ్య ప్రాథమిక చర్చలు సాగుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో క్యాలెండర్ విండోను బట్టి అదనపు సిరీస్‌లను చేర్చే అవకాశం ఉండటంతో ఈ ట్రై సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ వార్త నిజమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు. ఇటీవల 2026 జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 138 పరుగులతో విద్వంసకర శతకం బాదగా విరాట్ కోహ్లీ 74 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి తమ సత్తాను మరోసారి చాటారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ సీనియర్ జోడీ ఆడుతుందా లేదా అనే ప్రశ్నలు ఒకవైపు వినబడుతున్న వేళ ఈ ట్రై సిరీస్ కనుక ఖరారైతే వారి ఫామ్, ఫిట్‌నెస్‌ను చాటుకోవడానికి ఇది ఒక గొప్ప వేదికగా మారుతుంది.
ఒకవైపు జట్టులోని యంగ్ టాలెంట్‌కు అగ్రశ్రేణి జట్లతో తలపడి తమను తాము నిరూపించుకునే అవకాశం దక్కుతుంది, మరోవైపు రోహిత్, కోహ్లీల సుదీర్ఘ అనుభవం ప్రపంచకప్‌కు ముందు జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుంది. అందుకే ఈ ట్రై సిరీస్‌కు సంబంధించి బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వస్తుందా అని రో-కో అభిమానులతో పాటు సగటు క్రికెట్ ప్రేమికులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.