హెచ్1 బీ వద్దు...ఎఫ్1 ముద్దు....
ప్రస్తుతం అమెరికాలో యాంటీ ఇండియా సెంటిమెంట్ డ్రామా నడుస్తోంది. మిగిలిన దేశాల మాట ఎటున్నా....ఇండియా నుంచి వచ్చారనగానే వారిని అమెరికా జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.;
అమెరికాలో ఉద్యోగం చేస్తూ చాలా కాలందాకా కొనసాగాలంటే కచ్చితంగా హెచ్1బీ వీసా కావల్సిందే. కానీ ట్రంప్ రాజ్యం వచ్చాక హెచ్1బీ వీసా అనేది బ్రహ్మపదార్థంగా మారిపోతోంది. దరఖాస్తు చేసింది మొదలు అది చేతికి అందేదాకా పలు ఆటంకాలు అడ్డంకులు. పైగా ఒకవేళ హెచ్1బీ వీసాదారుడిగా ఉంటున్నా...ఏ చిన్న కారణాన్నైనా నెపంగా చూపి దేశం నుంచి గెంటేయడానికి ట్రంప్ కత్తులు నూరుతునే ఉంటాడు. మరీ ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన వలస ఉద్యోగులు అంటే ట్రంప్ కే కాదు చాలా మంది అమెరికన్లకు కడుపుమంటగా మారిపోయింది. వారి దేశ సంపదను దోచుకుంటున్న దోపిడీ దారుల్లా చిత్రీకరిస్తున్నారు. అందుకే వీసా అనేది సౌకర్యమే కానీ దేశంలో ఉండిపోవడానికి రాజ్యాంగబద్ధ హక్కు కానేకాదంటూ ట్రంప్ పక్షం వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఐటీయన్లు అందులోనూ పదేళ్ళ సీనియర్లు కూడా ఇండియాలో ఏ చిన్న అవకాశం దొరికినా జంప్ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో యాంటీ ఇండియా సెంటిమెంట్ డ్రామా నడుస్తోంది. మిగిలిన దేశాల మాట ఎటున్నా....ఇండియా నుంచి వచ్చారనగానే వారిని అమెరికా జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇండియాలో ఉన్న మన కన్నా అక్కడే ఉంటున్న ఇండియన్లకు ఇది అనుభవంలోకి వచ్చిన అంశం. వాస్తవానికి ట్రంప్ రాకముందు ఇండియా అమెరికా మధ్య సత్సం బంధాలు ఉండేవి. వాణిజ్య పరంగా వ్యూహాత్మక సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తూ వచ్చాయి. అలాగే ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ చదువుకున్న నిరుద్యోగులు ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ దశాబ్దాలుగా స్థిరపడ్డారు కూడా. వీరిలో చాలా మంది గ్రీన్ కార్డు హోల్డర్లూ ఉన్నారు. అక్కడ డాలర్లలో సంపాయించి ఇండియాలో రూపాయల్లో పెట్టుబడులు పెట్టి ఆస్తులు కూడగట్టుకున్న వారికి కొదవే లేదు. అంతెందుకు ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇండియాతో సంబంధాలు అంతగా బెడిసి కొట్టలేదు. మోదీకి ట్రంప్ కు మధ్య చక్కని సయోధ్య ఉండేది. అయితే రెండోసారి అధికారంలోకి రావడానికి ట్రంప్ ఆదేశ స్థానికత్వ సెంటిమెంట్ ను గురిచేసుకుని రంగంలోకి దిగాడు. ఇది బాగా వర్కవుట్ అయ్యింది. అమెరికాను పలు దేశాలు అడ్డంగా దోచుకుంటున్నాయని, ఆ దేశ పౌరులు, యువత నిరుద్యోగులుగా మారిపోవడానికి ఇండియాలాంటి దేశాలే కారణమని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. పైగా అమెరికా దేశ ప్రయోజనం కన్నా అమెరికాకు మరేదీ ఎక్కువ కాదని, మేక్ అమెరికా ప్రౌడ్ అగెయిన్ వంటి ఉద్రేక పూరిత నినాదాలతో ట్రంప్ అధికారం దక్కించుకున్నాడు. ఇపుడు ట్రంప్ మహాశయుడి 2.0 పాలనా కాలం సాగుతోంది. ఇదే ఇండియన్లకు కంటకంగా మారుతోంది.
ఈ దారుణ నేపథ్యంలో అమెరికాలోని చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర టెకీలు హెచ్1బీ వీసా ఆటుపోట్లకు తట్టుకోలేక కళ్ళు తేలేస్తున్నారు. విపరీతమైన మానసిక వత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగం గాల్లో దీపం మాదిరిగా మారిపోయింది. ఏ క్షణాన్నైనా ఉద్యోగం గోవిందా అయ్యే ప్రమాదం అడుగడుగునా కనిపిస్తోంది. పైగా హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజులు కట్టాలి, సోషల్ మీడియా వెట్టింగ్ పరీక్షకు నిలబడాలి, ఏళ్ళ తరబడి క్యూలో వెయిట్ చేయాలి...ఇవన్నీ అయ్యేపని కాదన తేల్చుకుని వారు హెచ్1బీకి మంగళం పాడేసి ఎఫ్1 దిశగా మొగ్గు చూపుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీసా ఆధారిత ఉద్యోగాల వల్ల ఎలాంటి మానసిక ఆందోళనకు గురికావల్సి వస్తుందో...ఉద్యోగమే కాదు...జీవితాలు కూడా క్షణాల్లో ఎలా తల్లకిందులయ్యే ప్రమాదముందో దీన్ని బట్టే అర్థమవుతుంది. అందుకే చాలా మంది ఎఫ్ 1 వీసాదారులుగా ఉండిపోవడానికి సిద్ధపడుతున్నారు.హెచ్1 బీ వీసా చక్కని భవిష్యత్తు, ఆర్థిక భరోసానిచ్చే ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు... కానీ అంతకు మించి మానసిక హింస అనుభవించాల్సి ఉంటుంది. ఆ విపరీత ఒత్తిళ్ళ నడుమ మనసును చిక్కబట్టుకోవడం చాలా కష్టం. అందుకే తక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలొచ్చినా సరే ఎఫ్1 వీసానే సో బెటరు అనే స్థితికి అమెరికాలో ఉంటున్న ఇండియన్లు వచ్చేశారు.
ఇదే విషయాన్ని పంచుకుంటూ ఓ టెకీ హెచ్1 బీ వీసా కష్టాలు అంతా ఇంతా కాదని అంటున్నారు. హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే ముందు తన పేరును మేరీల్యాండ్ లోని మాక్ డేనియల్ కాలేజీలో డే1 సీపీటీ మాస్టర్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నారు. ఒక్కసారి హెచ్1బీ అప్రూవ్ కాగానే ఆ చదువు ఆపేసి మళ్ళీ పూర్తి స్థాయి పని ప్రారంభించారు. అయితే హెచ్1 బీ వీసా రాకముందు తను తీసుకున్న నిర్ణయం ఇపుడు పెద్ద అవరోధంగా మారడంతో ఎఫ్1 ప్లాన్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఎఫ్1 వీసాకు సమస్యలే లేవా అంటే దానికుండే ప్రాబ్లెమ్స్ దానికున్నాయి. ఎఫ్1 వీసాతో దేశానికి తిరిగి వచ్చే సమయంలో ఇమ్మిగ్రేషన్ సెక్యూరిటీ సమస్య తలెత్తింది. దేశాన్ని వదలాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఎఫ్1 వీసా స్టాంపింగ్ వేయించుకుని అంతకు ముందు చేరిన కోర్సు పూర్తి చేశారు. ఇది ఇంతటితో ఆగిపోలేదు. యూఎస్ అధికారులు డే 1 సీపీటీ కేసుల్ని చాలా క్షుణ్నంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. హెచ్1బీ వీసా వదులుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు భారీగా తగ్గిపోయే ప్రమాదముంది. ఇన్ని కష్టాల మధ్యలో అసలు అమెరికాలో మనమెందుకు ఉండాలి భయ్ అనుకునే వారు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ట్రంప్ పదవీకాలం పూర్తయ్యే దాకా ఎవరూ ఏం చేయలేరు...కనీసం మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ జోరుకు కళ్ళెం పడాలని కోరుకోవడం తప్ప.