యువతకు వరంగల్ ACP భావోద్వేగ సందేశం.. ఆ క్షణం మళ్లీ రాదంటూ!
వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఒక యువకుడి అంతిమయాత్రలో మాట్లాడుతూ, "జీవితం మళ్లీ రాదు, ఉన్న ఒక్క జీవితాన్ని వ్యసనాల పాలు చేయకండి" అని ఆవేదన వ్యక్తం చేశారు.;
క్షణికానందం కోసం చేసే పనులు జీవితకాల విషాదాన్ని మిగిలిస్తాయని వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఇప్పుడు అందరి కళ్లను చెమర్చుతోంది. రోడ్డు ప్రమాదంలో బలైపోయిన ఓ యువకుడి అంతిమయాత్రలో ఆయన పాల్గొని, అక్కడికి వచ్చిన స్నేహితులకు ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం, గంజాయి వంటి వ్యసనాలు నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకుంటాయో ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ భావోద్వేగ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి..
స్నేహితుడి మరణం.. ఒక హెచ్చరిక కావాలి:
వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఒక యువకుడి అంతిమయాత్రలో మాట్లాడుతూ, "జీవితం మళ్లీ రాదు, ఉన్న ఒక్క జీవితాన్ని వ్యసనాల పాలు చేయకండి" అని ఆవేదన వ్యక్తం చేశారు. మన కళ్లముందే తిరిగిన స్నేహితుడు విగతజీవిగా పడి ఉండటం కంటే పెద్ద పాఠం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఒక మనిషి చనిపోతే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పోడు, ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని గుర్తు చేశారు. ఇక స్నేహితుడి మరణాన్ని చూసైనా మిగిలిన యువతలో మార్పు రావాలని, అప్పుడే అతని ఆత్మకు నిజమైన శాంతి కలుగుతుందని ఆయన పిలుపునిచ్చారు.
చెడు స్నేహాలకు దూరంగా ఉండండి:
యువత దారి తప్పడానికి ప్రధాన కారణం 'చెడు సావాసం' అని ఏసీపీ స్పష్టం చేశారు. ఏ స్నేహితుడైతే నిన్ను మద్యం తాగమని లేదా గంజాయి అలవాటు చేయాలని చూస్తాడో, వాడు నీ స్నేహితుడు కాదని, నీ పాలిట శత్రువు అని ఘాటుగా చెప్పారు.ఇక వ్యసనాలకు ప్రేరేపించే స్నేహాన్ని వెంటనే వదులుకోవాలని హితవు పలికారు. గంజాయి, మద్యం వంటి అలవాట్లు చేసుకోవడం చాలా సులభం, కానీ వాటి నుండి బయటకు రావడం చాలా కష్టమని, ఈ ఊబిలో చిక్కుకుంటే ప్రాణాలు పోయే వరకు అది వదిలిపెట్టదని ఆయన హెచ్చరించారు.
తల్లిదండ్రుల కన్నీరు చూడకండి:
ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం యువత ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు, వారి వెనుక ఉన్న తల్లిదండ్రుల ఆక్రందనలు వర్ణనాతీతమని ఏసీపీ గుర్తు చేశారు. ముసలితనంలో తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు పాడె మోయాల్సి రావడం కంటే పెద్ద శిక్ష తల్లిదండ్రులకు ఉండదని అన్నారు. యువకులారా, మీరు చేసే ఒక్క తప్పు మీ కుటుంబాన్ని చీకటిలోకి నెట్టేస్తుందని గ్రహించండి. మీ ప్రాణం మీ ఒక్కరిది కాదు, మీ కుటుంబానిది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని అయన కోరారు. ఇక ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాటలు కేవలం ఒక ప్రసంగం కాదు, అది నేటి యువతకు ఒక హెచ్చరిక.