సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పోలీస్ దూరం: సీఎంకు అజ్ఞాత వ్య‌క్తి లేఖ‌

సీఎం చంద్ర‌బాబుకు అజ్ఞాత వ్య‌క్తి లేఖ రాశారు. ప్ర‌జాద‌ర్బార్‌లో భాగంగా టీడీపీ కార్యాల‌యానికి అనేక మంది ఫిర్యాదులు తీసుకువ‌స్తారు

Update: 2026-08-08 16:30 GMT

సీఎం చంద్ర‌బాబుకు అజ్ఞాత వ్య‌క్తి లేఖ రాశారు. ప్ర‌జాద‌ర్బార్‌లో భాగంగా టీడీపీ కార్యాల‌యానికి అనేక మంది ఫిర్యాదులు తీసుకువ‌స్తారు. అదేవిధంగా విన్న‌పాలు కూడా వినిపిస్తారు. ఇటీవ‌ల ఇక్క‌డ త‌పాలా కార్యాల‌యంలో ఉండే పెద్ద బాక్సును ఏర్పాటు చేశారు. అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కారం అవ‌స‌రం లేని పిర్యాదుల‌ను దీనిలో వేయొచ్చు. అనంత‌రం.. వీటికి పార్టీ నాయ‌కులు స‌మాధానం పంపిస్తారు. దీనిలో ఫోన్ నెంబ‌రు, అడ్ర‌స్ ఆధారంగా వ్య‌క్తుల‌ను కాంటాక్ట్ అయి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్చిస్తారు.

ఇలా ఓ లేఖ చంద్ర‌బాబును ఉద్దేశించి ఓ అజ్ఞాత వ్య‌క్తి రాయ‌డం గ‌మ‌నార్హం. దీనిలో ఆయ‌న కీల‌క విష యాల‌ను ప్ర‌స్తావించారు. దీనిని ఎవ‌రురాశారు? అనే విష‌యంపై పార్టీ వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీని కూడా ప‌రిశీలిస్తున్నారు. ఈ లేఖ‌ను ఎవ‌రు రాశారు? ఎప్పుడు రాశారు? అనే విష‌యాల‌పై దీర్ఘంగా దృష్టి పెట్టారు. అయితే.. వ‌చ్చిన లేఖలో ప‌లు కీల‌క విష‌యాలు సూచ‌న‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

లేఖ‌లో ఏముంది?

ప్ర‌ధానంగా 2 విష‌యాల‌ను అజ్ఞాత వ్య‌క్తి ప్ర‌స్తావించారు.

1) ప్ర‌జ‌ల‌కు పోలీసుల‌కు మ‌ధ్య దూరం పెరుగుతుండ‌డం. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి మీరు చెబుతున్న‌ట్టుగా లేదంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. పోలీసులు వీఐపీల సేవ‌లోను.. వైసీపీ నేత‌లను అరెస్టు చేయ‌డంలోను స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇది మంచిదే అయినా.. సామాన్యుల‌కు పోలీసులు అస్స‌లు అందుబాటులో ఉండ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీంతో కేసులు పెరిగిపోయి.. ప్ర‌జ‌లు విసిగిపోతున్నార‌ని.. త‌ద్వారా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

2) ఎమ్మెల్యేలు క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సత్సంబంధాలు ఉండాల‌ని.. కానీ, నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య భారీగా గ్యాప్ పెరిగిపోయింద‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వం చేసే మంచి కూడా ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేద‌న్నారు. తాను ఎవ‌రికీ అనుకూలం, వ్య‌తిరేకం కాద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. స‌గ‌టు రాష్ట్ర పౌరుడిన‌ని వ్యాఖ్యానించారు. వీటిని సానుకూల దృక్ఫ‌థంలో ఆలోచించాల‌ని కోరారు. ప్ర‌స్తుతం ఈ లేఖ చంద్ర‌బాబు పేషీకి చేరింద‌ని టీడీపీ నాయ‌కులు ఒక‌రు తెలిపారు.

Tags:    

Similar News