ఉమా, రాధాకు లాస్ట్ ఛాన్స్‌... ఈ సారి మిస్ అయితే అంతే...?

ఏదేమైనా ఉమా, వంగ‌వీటి రాధాకు ఈ సారి ప‌ద‌వి రాక‌పోతే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డుతుంది. వీరిపై అనుచ‌రుల్లో కాస్తో కూస్తో ఉన్న న‌మ్మ‌కాలు సైతం పూర్తిగా స‌డ‌లిపోతాయి.

Update: 2026-08-08 15:30 GMT

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో 'వంగవీటి', 'దేవినేని' పేర్లకు ఉన్న క్రేజ్, పొలిటికల్ బ్రాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాన్ని శాసించిన ఈ రెండు కుటుంబాలకు చెందిన కీలక నేతలు ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మారిన సమీకరణల నేపథ్యంలో వీరిని పార్టీ అధినాయ‌క‌త్వం ప‌ట్టించుకోక‌.. ఇటు త‌మ‌ను న‌మ్ముకున్న కేడ‌ర్‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తును తేల్చే ఆ అవకాశం ఎమ్మెల్సీ రూపంలో రానుంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, జకీయా ఖానంల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్థానాలు ఇప్పుడు కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఈ రెండు స్థానాల కోసం పొత్తులోని పార్టీల నుంచి దాదాపు 20 మందికి పైగా సీనియర్, జూనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వర్ల రామయ్య, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, బీటెక్ రవి వంటి సీనియర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా దేవినేని ఉమా, వంగవీటి రాధాకు అవ‌కాశం వ‌స్తుందా ? రాదా ? అన్న‌దే ఇప్పుడు బిగ్ స‌స్పెన్స్‌.

కృష్ణా జిల్లాలో నందిగామ‌, మైల‌వ‌రం నుంచి నాలుగుసార్లు గెలిచి 2014 ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన దేవినేని ఉమా 2019లో మాత్రమే ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించి, వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో ఉమాను బుజ్జగించిన అధిష్ఠానం.. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా రాజ్య‌స‌భ ఇస్తామ‌ని బుజ్జ‌గించింది. ఉమాకు సీటు రాక‌పోవ‌డం వెన‌క లోకేష్ ఉన్నార‌న్న ప్ర‌చార‌మూ గ‌ట్టిగానే న‌డిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆయనకు ఇప్పటికీ ఏ పదవీ దక్కలేదు. ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఉమా రాజకీయ భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడే ప్రమాదం ఉంది.

మరోవైపు, 2019 ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు అప్పట్లోనే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు బహిరంగంగానే హామీ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇక 2024 ఎన్నికల్లోనూ రాధాకు పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో, రాధాకు చంద్రబాబు ఎలా న్యాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఉమా, వంగ‌వీటి రాధాకు ఈ సారి ప‌ద‌వి రాక‌పోతే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డుతుంది. వీరిపై అనుచ‌రుల్లో కాస్తో కూస్తో ఉన్న న‌మ్మ‌కాలు సైతం పూర్తిగా స‌డ‌లిపోతాయి.

Tags:    

Similar News