పవన్ కల్యాణ్.. మరీ మూడో స్థానంలోనా!

Update: 2019-05-24 04:30 GMT
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతోంది. నిన్న ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయినా, ఇప్పటి వరకూ కూడా ఇంకా కొన్ని చోట్ల అధికారిక ప్రకటనలు పెండింగ్ లోనే ఉన్నాయి. కౌంటింగ్ విషయంలో ఈ సారి కొత్త నియమాలు - వీవీ ప్యాట్ల కౌంటింగ్ వంటి పరిణామాలు ఫలితాల వెల్లడిని మరింత లేట్ చేస్తూ వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు లేట్ గా బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మూడో స్థానానికి పరిమితం కావడం! గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో పవన్ కల్యాణ్ మూడో స్థానంలో నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. వాటిల్లో భీమవరం నుంచి పవన్ నెగ్గకపోయినా.. కనీసం గాజువాక నుంచి అయినా నెగ్గుతారని అంతా అనుకున్నారు. పవన్ కల్యాణ్ దృష్టి కూడా ప్రధానంగా గాజువాక మీద నిలిచింది. గాజువాక విషయంలో ప్రత్యేకంగా ప్రణాళికను కూడా ప్రకటించారు పవన్ కల్యాణ్. గాజువాకలో కాపుల ఓట్లు గట్టిగా ఉన్నాయని - అక్కడ పవన్ కల్యాణ్ విజయం సునాయాసమే అని అనేక మంది విశ్లేషించారు కూడా!

అలాంటి చోట పవన్ కల్యాణ్ మరీ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. గాజువాకలో పవన్ కల్యాణ్ విజయం కోసం చంద్రబాబు కూడా సహకారం అందించారని - ఆఖరికి ఆ నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థి పిలిచినా ప్రచారానికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు పవన్ విజయం కోసం సహకారం అందించారనే మాట వినిపించింది. అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి జయకేతనం ఎగరేశారు.

భీమవరం - గాజువాక రెండు చోట్లా పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడటం ఒక విశేషం అయితే, గాజువాకలో మరీ మూడో స్థానంలో నిలవడం మరో విశేషం!
Tags:    

Similar News