అసోంలో ఇడ్లీ.. దోశె.. అది రూ.10కే!
ఏపీలోని తిరుపతి కానీ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కానీ.. లేదంటే తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి కానీ గౌహతికి దూరం లెక్కేస్తే దగ్గర దగ్గర 2500 కి.మీ. (కాస్త అటు ఇటుగా) ఉంటుంది.;
ఇంటికి కూతవేటు దూరంలో ఉండే టీ షాప్ లో బుజ్జి కప్పు టీ సైతం రూ.10కి దొరకని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో అయినా.. ఇడ్లీ కానీ దోశె కానీ చట్నీ.. సాంబార్ తో పది రూపాయిలకే దొరకటం కష్టం. అలాంటిది తెలుగు రాష్ట్రాలకు దాదాపు 2500 కి.మీ. దూరంలో ఉండే అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలో (కొద్ది కాలంగా దీన్ని గువాహటి అని పిలుస్తున్న సంగతి తెలిసిందే) మాత్రం పది రూపాయిలకే చట్నీ.. సాంబార్ తో ఇడ్లీ లేదంటే దోశెను అమ్ముతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఏపీలోని తిరుపతి కానీ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కానీ.. లేదంటే తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి కానీ గౌహతికి దూరం లెక్కేస్తే దగ్గర దగ్గర 2500 కి.మీ. (కాస్త అటు ఇటుగా) ఉంటుంది. తెలుగు నేలకు అంత దూరాన ఉన్న ప్రాంతంలో తెలుగు వంటకాలు అంత తక్కువ ధరకు అమ్మటానికి మించిన ఇస్పెషల్ ఇంకేం ఉంటుంది.మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సదరు హోటల్ నడుపుతున్న మహిళ తెలుగు ప్రాంతానికి చెందిన వారు కాకపోవటం గమనార్హం. గౌహతికి చెందిన 47 ఏళ్ల సన్నో కౌర్ ఈ చిన్ని హోటల్ ను నిర్వహిస్తున్నారు.
తెలుగు కాలనీకి దగ్గర్లో గౌహతి క్లబ్ ఫ్లైఓవర్ వద్ద ఉండే ఈ హోటల్ లో ఇడ్లీ.. దోశె లాంటి సౌత్ వంటకాల్ని తక్కువ ధరకే అమ్ముతున్నారు. నిజానికి దోశె.. ఇడ్లీ వంటకాలు కౌర్ కు అవగాహన లేదు. కాకుంటే.. వీటిని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో మొదలు పెట్టిన ఈ చిన్న హోటల్ ను గత ఏడాదే ప్రారంభించారు. ప్లెయిన్ దోశ రూ.10కి అందిస్తారు. కొబ్బరి చట్నీ.. సాంబార్ వడ్డిస్తారు. ఇడ్లీని కూడా రూ.10కే అమ్ముతారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ చిరు హోటల్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. సాయంత్రం 5 గంటలకు మొదలై.. రాత్రి 9 గంటల వరకు ఈ హోటల్ ను నడుపుతారు. కౌర్ ఫ్యామిలీలో ఉన్న పద్నాలుగు మంది ఈ హోటల్ నిర్వహణలో పాలు పంచుకోవటం విశేషం. తక్కువ ధరకు అమ్ముతున్నా.. కస్టమర్లనుంచి అంతే మద్దతు వస్తోందని.. ప్రతి రోజు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు సంపాదన ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఈ చిరు హోటల్ కు వచ్చే వారిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉంటారు. ఇక్కడి మెనూ చూస్తే.. మసాలా దోశె రూ.20, ఎగ్ దోశె రూ.30, చీజ్ దోశె రూ.40, ఆలూ పరాఠా రూ.20కు అమ్ముతారు. ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నా.. తక్కువ ధరకు టిఫిన్లు అమ్మటం ద్వారా అందరికి అందుబాటులో ఆహారాన్ని అందిస్తున్న తృప్తి కలుగుతుందని కౌర్ చెబుతారు. నిజమే కదా?