తెలుగోళ్లకు కాకినాడ కాజా.. బిహారీలకు సిలావ్ ఖాజా

కాకినాడ కాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగోళ్లకు సుపరిచితమైన కాకినాడ కాజా కోట్లాది మంది మనసుల్ని దోచేస్తుంది.;

Update: 2025-12-15 07:30 GMT

కాకినాడ కాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగోళ్లకు సుపరిచితమైన కాకినాడ కాజా కోట్లాది మంది మనసుల్ని దోచేస్తుంది. సరైన రీతిలో దీన్ని వండాలే కానీ.. అలా తింటూ పోవటమే అన్నట్లుగా ఉంటుంది. తెలుగోళ్లకు కాజా మాదిరి బిహారీలకు ఒక స్వీట్ ఉంది. బిహారీల మనసుల్ని మాత్రమే కాదు దేశ ప్రధాని సైతం దాని రుచికి ఫిదా అయ్యే పరిస్థితి. దాని పేరు ‘సిలావ్ ఖాజా’. తాజాగా ఈ మిఠాయికి భారత ప్రభుత్వం జాగ్రఫికల్ ట్యాగ్ ను మంజూరు చేయటంతో ఈ మిఠాయి మరోసారి వార్తల్లోకి వచ్చింది.

బిహార్ లోని నలంద జిల్లా సిలావ్ పట్టణంలో ఈ మిఠాయిని తయారు చేస్తారు. ఈ మిఠాయిని బిహారీలే కాదు.. దేశంలోని పలు ప్రాంతాల వారు దీన్ని ఇష్టంగా తింటుంటారు. తాజాగా జారీ చేసిన జీఐ ట్యాగ్ సిలావ్ లోని ‘శ్రీ కాళీ షా ఖాజా’ షాప్ కు దక్కింది. దాదాపు 150 ఏళ్ల క్రితం సిలావ్ కు చెందిన పాకశాస్త్ర నిపుణుడు కాళీ షా ఈ మిఠాయిని తొలిసారి తయారు చేశారని చెబుతారు.

ఆ తర్వాతి కాలంలో కాళీ షా వారసులంతా ఆయన పేరుతో షాపులు పెట్టుకోవటం జరిగింది. ప్రస్తుతం సిలావ్ లో కాళీ షా పేరుతో 13 ఖాజా షాపులు ఉన్నట్లుగా చెబుతారు. త్వరలో మఖానా ఖాజాను మార్కెట్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మిఠాయిలో పలు రకాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ధరలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.250 నుంచి కేజీ రూ.3 వేల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఈ మిఠాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కాదు.. గతంలో లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ మిఠాయిని రైల్వే మెనూలోనూ చేర్పించారు. తాజాగా జీఐ ట్యాగ్ లభించటంతో ఈ మిఠాయి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Tags:    

Similar News