కొత్త ఏడాది జోష్.. రూ.6 కోట్ల బిర్యానీ హాంఫట్!

కొత్త ఏడాది వేడుకలంటే కేకులు.. స్వీట్లు మాత్రమే కాదు.. ఇప్పుడు ‘బిర్యానీ’ విందు తప్పనిసరి అయిపోయంది.;

Update: 2026-01-01 12:47 GMT

కొత్త ఏడాది వేడుకలంటే కేకులు.. స్వీట్లు మాత్రమే కాదు.. ఇప్పుడు ‘బిర్యానీ’ విందు తప్పనిసరి అయిపోయంది. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు భారీ ఎత్తున విందు వినోదాల్లో మునిగితేలారు. బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా సాగిన ఈ సంబరాల్లో రికార్డు స్థాయిలో బిర్యానీలు కడుపులోకి వెళ్లడం విశేషం.

జిల్లావ్యాప్తంగా ఆహార సంబరాలు

బుధవారం సాయంత్రం 7 గంటల నుంచే జిల్లాలోని ప్రధాన కూడళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కిటకిటలాడాయి. యువత, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు సమూహాలుగా చేరి కేకులు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రధానంగా హోటళ్ల వద్ద బిర్యానీ కోసం జనం బారులు తీరారు. ఆర్డర్ల తాకిడి తట్టుకోలేక చాలా రెస్టారెంట్లు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి.

జిల్లా జనాభా సుమారు 12.75 లక్షలు కాగా.. గణాంకాల ప్రకారం అందులో ప్రతి ఇద్దరిలో ఒకరు బిర్యానీని ఆస్వాదించినట్లు తెలుస్తోంది. సుమారు 6 లక్షల మంది ఆర్డర్ చేస్తే.. ప్లేట్ బిర్యానీ రూ.100 గా లెక్కించినా.. రూ. 6 కోట్లు బిర్యానీలకు మాత్రమే.. కేకులు, కూల్ డ్రింక్స్, ఇతర స్నాక్స్‌ను కూడా కలిపితే ఈ ఖర్చు మరో రెండు మూడు కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా.

హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లు, నైట్‌ కిచెన్లు ఏర్పాటు చేయడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. చాలా చోట్ల ముందస్తు ఆర్డర్లు తీసుకోవడంతో అర్ధరాత్రి వరకు సరఫరా కొనసాగింది. ఫుడ్‌ డెలివరీ సేవలు కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ నమోదు చేసినట్లు సమాచారం.

రికార్డు స్థాయిలో ఆన్‌లైన్ ఆర్డర్లు

హోటళ్లకే కాకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌కు కూడా ఆర్డర్ల తాకిడి పెరిగింది. అర్ధరాత్రి 12 గంటల వరకు డెలివరీ బాయ్స్ వీధుల్లో బిజీగా కనిపించారు. నైట్ కిచెన్లు, స్పెషల్ ఆఫర్లు ఉండటంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి.

మొత్తానికి ఆనందం.. రుచి మేళవింపుతో కొత్త ఏడాది వేడుకలు జిల్లాలో భారీ ఆర్థిక చలనాన్ని తీసుకువచ్చాయి.

Tags:    

Similar News